Friday, May 10, 2024

వైద్యాభివృద్ధికి సహకరించండి, ఎంపీ సత్యవతి ప్రశ్నలకు కేంద్రమంత్రుల జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో శంకుస్థాపన పూర్తి చేసుకున్న 16 మెడికల్ కాలేజీలకు సహాయ సహకారాలు అందించవలసినదిగా వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సూఖ్ మాండవీయ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ పార్లమెంటేరియన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ 19 మేనేజ్మెంట్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సీఎం జగన్ నాయకత్వంలో కోవిడ్ గడ్డు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామని, రాబోయే రోజుల్లో కోవిడ్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపొందించేందుకు రీసెర్చ్ సెంటర్లకు కేంద్రం సహకారం అందించాలని ఎంపీ సత్యవతి కోరారు. విభజిత ఆంధ్రరాష్ట్రంలో వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారని మెడికల్ కాలేజీలకు చేయూతనిస్తే త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ సత్యవతి ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 562 జిల్లాల్లో 1244 కేంద్రీయ విద్యాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ దేశంలోని 112 జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా గుర్తించిందని ఆమె వెల్లడించారు. అనంతరం ఎంపీ గత మూడేళ్లుగా పరిశోధనలకు కేటాయించిన నిధుల వినియోగం తక్కువగా ఉందా అని అడిగారు. పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖా మంత్రి అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ ఆమె ప్రశ్నలకు బదులిచ్చారు. పరిశోధన-అభివృద్ధి పథకం పర్యావరణంలో ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు, సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో స్టాండప్ ఇండియా పథకానికి ఇచ్చిన నిధులు, లబ్ధిదారుల వివరాలు తెలియజేయాల్సిందిగా ఎంపీ అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. భగవత్ కరాడ్ బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాండప్ ఇండియా పథకం కింద గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు 787.81 కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement