Monday, May 20, 2024

Election Festival – ఖాళీ అవుతున్న భాగ్య‌న‌గ‌రం – పోలింగ్​కు పోదాం పా!


ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13న తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్​ జరగనుంది. అయితే.. ఈ ఓట్ల పండుగ కోసం హైదరాబాద్​ మహా నగరం నుంచి జనం పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. పోలింగ్​కు పోదాం పా.. అంటూ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ సిటీ ఖాళీ అవుతోంది. రహదారులు, బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీకి తగ్గట్టు స్పెషల్‌ ట్రైన్లు, బస్సులను ఏర్పాటు చేసినా పట్టు చాలడం లేదు. దీంతో కొంతమంది లీడర్లు సొంతంగా వాహనాలను సమకూర్చి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధి నిమిత్తం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వచ్చిన చాలామంది తమ అభిమాన పార్టీకి ఓటు వేసేందుకు సొంతూళ్లకు పయనవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు.. ఏపీ వైపు వెళ్లే బస్సులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. నెల రోజుల క్రితమే రైలు రిజర్వేషన్లు అయిపోయాయి. వందల్లో వెయిటింగ్‌ లిస్టులు కనిపిస్తున్నాయి. ఇక.. రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా అన్నింటిలో సీట్లు రిజర్వ్‌ అయిపోయాయి. అదనంగా నడిపేందుకు బస్సులు లేకపోవడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి బస్సులో విశాఖకి 12 గంటలకుపైగా పడుతుండటంతో ఏపీ స్లీపర్‌కి డిమాండ్‌ పెరిగింది. ఎన్నికల సీజన్‌ కావడంతో ఎప్పుడూ లేనంతగా ప్రైవేట్‌ బస్సుల టికెట్‌ ధరలు పెంచేశాయని చాలామంది అంటున్నారు.

- Advertisement -

కలిసి వచ్చిన వేసవి సెలవులు..

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లలో ఈనెల 12వ తేదీ వరకే రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలో దాదాపు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఈనెల 10, 11న దూర ప్రాంత రైళ్లలో వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్‌ ఉంది. మరి కొన్నింట్లో పరిమితి దాటినట్లు సమాచారం అందుతోంది. సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే వివిధ స్పెషల్‌ రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగా టీఎస్‌ఆర్టీసీ అదనపు బస్సులు నడిపిస్తోంది. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి టికెట్‌ ధరపై 10శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్‌ తెలిపారు. దీంతో అన్ని బస్సుల్లో ముందస్తు బుకింగ్స్​ అయిపోయినట్టు తెలుస్తోంది.

సొంతూళ్లకు ఉరుకులు, పరుగులు..

గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు సమయాల్లో పోలింగ్ జరిగేది. దీంతో ఏపీ ఓటర్లు రెండు చోట్ల ఓట్లు వేసేవారు. 2004, 2009లో తెలంగాణతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓసారి, ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, రాయలసీమతో కలిపి మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత ఆంధ్ర, రాయలసీమల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాద్‌లో ఓటున్న సీమాంధ్రులు తొలుత తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత అదే ఓటర్లు ఆంధ్ర ప్రాంతంలో ఓటింగ్‌లో తమ ఓటును వేశారు. అయితే.. ఈసారి ఇలా వీలు కావడంలేదు. ఎందుకంటే మే 13న తెలంగాణ, ఏపీలో ఒకే దఫా ఎన్నికలు జరగనుండటమే ఇందుకు కారణం.

వరుస సెలవులూ కారణమే..

ఏపీలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో లోక్​సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. గతంలో రెండు చోట్ల ఓట్లు వినియోగించుకునే దాదాపు 40-50 లక్షల మంది ఓటర్లు ఎక్కడో ఒకచోటే ఓటు హక్కును వినియోగించాల్సి వస్తోంది. ఏపీ ఓటర్లు 13న ఏపీలోనే ఓటేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ 13న సోమవారం జరగనుంది. అంతకు ముందు ఆదివారం, రెండో శనివారాలు సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజుల సెలవులతో సొంతూళ్లకు ఓటర్లు క్యూ కడుతున్నారు.

ఈ జిల్లాల వారే హైదరాబాద్​లో ఎక్కువ..

లక్షల మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వలసలు వచ్చి ఉపాధి, విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇలా 40-50 లక్షల మందికి హైదరాబాద్‌తోపాటు వారి సొంత ప్రాంతాల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారిలో ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు. కృష్ణా జిల్లాల వారే ఉన్నారని అనధికారిక సమాచారం. ఇలా రెండేసి చోట్ల ఓటు హక్కున్న ఓటర్లు ఎక్కువగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజ్‌గిరి, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లలో ఉండొచ్చని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement