Wednesday, May 22, 2024

Delhi: గోరంట్ల వీడియోకు, చంద్రబాబు కేసుకు లింకేంటి? మాధవ్‌పై చ‌ర్య తీసుకోవాల‌ని స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభా మర్యాదలు కాపాడ్డం కోసమే లేఖ ద్వారా గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని టీడీపీ ఎంపీలు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… సభా మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత ఎంపీలుగా తమపై ఉందన్నారు. ఆ వీడియోను వెరిఫై చేసి, భవిష్యత్తులో మరో ఎంపీ అలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎవరు ఎలాంటి వీడియోలు తీస్తారో తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల మీద ప్రజలకు నమ్మకం ఎలా దిగజారిపోతుందో స్పీకర్‌కు వివరించామని వెల్లడించారు. చర్యలు తీసుకుంటామని చెప్పిన వైఎస్సార్సీపీ ప్లేటు ఫిరాయించిందని, మాధవ్‌కు మద్ధతుగా ఆందోళనలు చేపడుతున్నారని ఆరోపించారు. ఒక ఎంపీ మీదే చర్యలు తీసుకోనప్పుడు, ఇక సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుందని రామ్మోహన్ ప్రశ్నించారు. ఇదేదో ఒక ఎంపీ ప్రైవేటు వ్యవహారం కాదన్న ఆయన, మిగతా ఎంపీలు కూడా ఇలాగే ఉంటారేమోనన్న అనుమానం దేశ ప్రజలందరికీ కలుగుతోందని చెప్పుకొచ్చారు. కేసుల నుంచి కాపాడుకోవడం, మాధవ్ వంటి వ్యక్తులను కాపాడుకోవడంలో ఉన్న ఆరాటం, పోరాటం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మహిళల సంరక్షణ, మహిళల గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్‌తో చర్యలు మొదలుపెడితే, వైఎస్సార్సీపీ అంతా ఖాళీ అవుతుందని భయపడుతున్నారని, మంత్రులు సహా ఇంకా చాలామంది ఎంపీల బాగోతాలు బయటపడతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని రామ్మోహన్ ఎద్దేవా చేశారు. ఆ దరిద్రాన్ని ఒక్కసారి చూడ్డానికే అసహ్యంగా ఉంటే టీడీపీ వీడియోను ఎలా తయారు చేస్తుందని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ విచారణకు ఎన్ని రోజులు పడుతుందన్న ఆయన, ఈ అంశాన్ని నీరుగార్చేందుకు, మాధవ్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీలందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు స్వతంత్రంగా మద్ధతు ప్రకటించామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఏపీ సర్కారు సహకరిస్తోందని ఆరోపించారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అందరికీ చెప్తాం : కనకమేడల
అనంతరం కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేయిస్తుంటే గోరంట్ల వీడియోపై మాత్రం చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. సుమోటోగా విచారణ జరపాల్సింది పోయి సమర్ధిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ మహిళలు తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని, గోరంట్ల వ్యవహారంపై పార్లమెంట్‌లో ఎంపీలు చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు ముద్దాయి కాదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని కనకమేడల అన్నారు. గోరంట్ల వీడియోకి, చంద్రబాబు కేసుకి ముడిపెడుతున్నారంటే వైసీపీకి నైతికత లేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ అసమర్ధత కప్పి పుచ్చుకోడానికి టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.

ప్రతి అంశం మీదా మాట్లాడటానికి సజ్జల ఎవరని నిలదీశారు. టీడీపీ దొడ్డిదారిలో ఏది చేయదన్న కనకమేడల, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చెబుతామని స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీకి జగన్ ఎందుకు రాలేదు, చంద్రబాబు అంటే భయపడ్డారా అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో సీఎం ప్రత్యేక హోదా, పోలవరం అంశాలు మాట్లాడారా అని అడిగారు. పోలవరం ప్రాజెక్ట్ తిరోగమనంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పెట్టుకునే అంశంపై అసెంబ్లీకి అధికారం ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం ద్వారా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మూడు రాజధానులు పెట్టుకోలేమని బిల్లు ద్వారా తెలిపారని ఆరోపించారు. జైల్లో ఉన్న నేతలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని, అధిక కేసులు వైసీపీ నేతల మీదే ఉన్నాయని ఎంపీ రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement