Thursday, May 16, 2024

మార్చి 30 నుండి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు..

శ్రీశైలంలో ఈనెల 30 నుండి ఏప్రిల్ 3 వతేదీ వరకు ఉగాదిమహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు . ఐదురోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవ ఏర్పాట్లపై మంగళవారం శ్రీశైలం లోనీ కార్యాలయ భవనంలో లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆలయ ఈవో లవన్న ప్రకటించారు. ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 6న ఇప్పటికే ప్రాథమిక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు , పాదయాత్ర బృందాలు, కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంత స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం అధికార యంత్రాంగం విజయపురలో ( బీజాపూర్ ) సమన్వయ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది . కాగా సదరు సమావేశములలో తీసుకున్న నిర్ణయాల అనుసరించి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్వామివారి ఆలయ ఉపప్రధానార్చకులు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు, దేవస్థానం అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు , తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 24 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యే 30 వ తేదీ వరకు అంటే ఏడు రోజులపాటు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించేందుకు నిర్ణయించడమైంది. అనంతరం ఉత్సవాలలో రెండవ రోజైన మార్చి 31 వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే ఏప్రిల్ 3 వ తేదీ వరకు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనంకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ దర్శనాల తేదీలను ఇప్పటికే విజయపురలో ( బీజాపూర్ లో జరిగిన సమావేశంలో పాదయాత్ర భక్త బృందాల ప్రతినిధులకు , స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులకు తెలియజేశారు. అదేవిధంగా కర్ణాటక , మహారాష్ట్రలలో కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం గమనార్హం . కాగా మార్చి 24 వ తేదీ నుంచి మార్చి 30 తేదీ వరకు సామూహిక అభిషేకాలను రూ . 1500 , శ్రీ వృద్ధమల్లి కార్జునస్వామి ఆలయములో నిర్వహించబడుతాయి . ఈ అభిషేక సేవాకర్తలకు స్వామివార్ల స్వరదర్శనం కల్పించబడుతుంది. అయితే శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం యథావిధిగా ప్రతీరోజు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా సమావేశంలో కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ మార్చి 31 వ తేదీ నుంచి స్వామివార్ల స్పర్శదర్శనం నిలిపివేయబడుతున్న కారణంగా భక్తులు ఉత్సవాల ప్రారంభంకంటే వారం రోజుల ముందు నుంచే క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉందని , కావున ఆయా ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయనున్నారు . అలాగే ఉత్సవాల కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు . ఉగాది ఉత్సవాలకు చేపట్టబడిన కార్యాచరణ ప్రణాళికను, భక్తులరద్దీని బేరీజు వేసుకుంటూ తగిన ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేస్తున్నారు. అన్ని విభాగాల అధికారులందరు కూడా నిరంతరం స్థానిక పోలీస్ , అటవీ , వైద్యశాఖ తదితర అధికారుల సమన్వయముతో ఉత్సవాల నిర్వహణలో ఆయా చర్యలు తీసుకోనున్నారు. కాలిబాటలో వచ్చే భక్తుల సౌకర్యార్థం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో ఏర్పాటు చేసినట్లుగానే కైలాసద్వారం నుంచి భీమునికొలను వరకు మంచినీటిసదుపాయం కల్పించనున్నారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం నీటిసరఫరా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా వెంకటాపురం , నాగలూటి, అటవీమార్గములో భక్తులకు కన్నడ భాషలో సూచన బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దర్శనం క్యూలైన్లు విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా క్యూలైన్లలో నిరంతరం మంచినీరు , అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందించారు. . ఉత్సవాలలో భక్తులరద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కారణంగా క్యూకాంప్లెక్స్ లో ముందస్తుగానే మంచినీటిని సిద్ధంగా ఉంచనున్నారు . శ్రీకృష్ణదేవరాయగోపురం నుండి స్వామివార్ల ఆలయప్రవేశ ద్వారం వరకు, స్వామి ఆలయ వెలుపల నుండి అమ్మవారి ఆలయ ప్రవేశం వరకు కూడా నిరంతరం భక్తులకు మంచినీటిని అందించనున్నారు. కాలిబాట మార్గంలోని నాగలూటి , పెద్ద చెరువు , కైలాసద్వారం మొదలైన చోట్ల, శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు . పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక ముందుకెళుతున్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైనచోట్ల కాయిరా మ్యాట్ ఈ కాయిర్మ్యాట్ ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ చర్యలు తీసుకునేలా సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement