ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిది మంది వ్యక్తులతో వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న డంపర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వ్యక్తులంతా అందులోనే ఇరుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులోని వ్యక్తులను బయటకు తీసేందుకు యత్నించారు. వేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయని.. మరో వ్యక్తి గాయపడ్డారని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఇసుక చెల్లాచెదురుగా పడిపోయింది. మృతులు భాగ్‌తండా నుంచి గుణకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు పోలీస్ అని.. అతని వద్ద ఐడీకార్డు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.