Thursday, May 16, 2024

హిజ్రాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు.. ఐదేళ్లకు రూ.265 కోట్ల కేంద్ర బడ్జెట్‌

న్యూఢిల్లిd, ఆంధ్రప్రభ: హ‌ఇజ్రాల సంక్షేమానికి స్మైల్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మనదేశంలో హిజ్రాలపై జరుగుతున్న దాడుల గణాంకాలను జాతీయ నేరాల నమోదు బ్యూరోలో పొందుపరుస్తున్నారా అని వైసీపీ తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 55 నేరాలకు సంబంధించిన కేసుల గణాంకాలను ఆయన జవాబులో పేర్కొన్నారు. బ్యూరో ప్రచురించే క్రైమ్స్‌ ఇన్‌ ఇండియా పత్రికలో అన్ని నేరాల గణాంకాల వివరాలున్నాయని చెప్పారు. 2020వ సంవత్సరంలో దేశంలో హిజ్రాలపై జరిగిన దాడులకు సంబంధించి మొత్తం 236 కేసులు నమోదయ్యాయని… 10 మంది హత్య, 29 మంది ఆత్మహత్య, నిర్లక్ష్యం కారణంగా మరో 46 మంది మరణించగా, 61 మందిపై దాడి జరిగినట్లు కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2019లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ హిజ్రాల హక్కుల పరిరక్షణ చట్టం తీసుకురావడంతో పాటు 2020లో హిజ్రాల హక్కుల నిబంధనలను కూడా రూపొందించిందని మంత్రి తెలిపారు.

ఆ మంత్రిత్వ శాఖ హిజ్రాల జీవనోపాధి కోసం స్మైల్‌ అనే పథకాన్ని రూపొందించిందన్నారు. హిజ్రాల సమగ్ర సంక్షేమం, పునరావాసం, జీవనోపాధి, వైద్య సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం స్మైల్‌ పథకం కింద మరో ఉప పథకాన్ని కూడా ప్రభుత్వం రూపొందించిందని ఆయన వివరించారు. హిజ్రాల రక్షణ సెల్‌ను ఆయా రాష్ట్రాల డీజీపీల పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాక హిజ్రాల సంరక్షణ, సంక్షేమం, పునరావాస కల్పన కోసం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు ఐదేళ్లకుగాను కేంద్ర ప్రభుత్వం 265 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కూడా కేటాయించిందని అజయ్‌ కుమార్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement