Thursday, May 2, 2024

Followup: నాది సంక్షేమం తెచ్చే మార్గం, వారిది సంక్షోభం రేపే దుర్మార్గం: సీఎం జగన్

తిరుపతి, (ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ) : ”పాదయాత్ర సందర్భంగా పేదవర్గాలు పిల్లల చదువుకోసం పడే కష్టాలను చూసి విద్యారంగానికి, సంబంధిత సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను వెచ్చించే పథకాలను రూపొందించి, అమలు చేస్తున్నాను. నేను చేస్తున్న కృషి ఫలితాలు రాష్ట్రంలోని పేద ప్రజల గుండెల్లో నాపై ప్రేమాదరణలతో ప్రతిఫలిస్తోంది. ఆ కడుపుమంటతోనే ఒక ఎల్లో పార్టీ, మూడు ఎల్లో మీడియా సంస్ధలు దుష్టచతుష్టయంగా మారి రాష్ట్రంలో దుష్ప్రచారాలను చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు నానావిధాలుగా పాట్లు పడుతున్నారు. ఎల్లో పార్టీ, ఎల్లో మీడియాలతో కూడిన దొంగలముఠా కుట్రల విషయంలో, వారు చేసే అసత్య ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను.” అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఆయన 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 10.85 లక్షల మంది విద్యార్దుల తల్లుల ఖాతాల్లోనికి రూ.709 కోట్ల నిధులను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసారు. ఆ సందర్భంగా తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో పేద ప్రజలు తమ పిల్లలను చదివించుకోడానికి పడే కష్టాలను కళ్లారా చూసానన్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ ను సైతం గత ప్రభుత్వం తుంగలో తొక్కించిందని గుర్తించానన్నారు.

విద్యారంగసంక్షేమ పరంగా తన తండ్రి ఒక్క అడుగు వేస్తే తాను నాలుగు అడుగులు వేయాలని అప్పుడే సంకల్సించానన్నారు. ఆ లక్ష్యంతోనే రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలవారీగా పథకాలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నానన్నారు. ఈ క్రమంలోనే ఉన్నత విద్యను పేద,బడుగు వర్గాలందరికీ చేరువ చేసే లక్ష్యంతోనే జగనన్న విద్యాదీవెన, చదువుకునే పిల్లల వసతి సౌకర్యాలు తల్లితండ్రులకు భారం కాకూడదనే జగనన్న వసతి దీవెన పథకాలను రూపొందించానన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆ పథకాల కింద గత 35 నెలల పాలనలో రూ.10,994 కోట్ల నిధులను లబ్దిదారుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకున్నానన్నారు.ఇది ఖర్చుగా కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక ఉన్నత విద్యాధికుడిని తయారు చేసే కార్యక్రమానికి పెట్టుబడిగా భావిస్తున్నానన్నారు. ఇదే గత ప్రభుత్వం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌కు గండి కొట్టడమే కాక దాదాపు రూ.1,800 కోట్ల బకాయీలను వదలిపెట్టిపోయిందన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పట్టించుకోకుండా వాటిని మూసేస్తే భారం తగ్గుతుందనే ధోరణిలో పనులు చేసిందన్నారు. పిల్లలను చదివించడానికి పాఠశాలలకు పంపితే రూ.15 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేసానన్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చే లక్ష్యంతో నాడు-నేడు అనే బృహత్‌ కార్యక్రమం చేపట్టి తొలిదశలో రూ.3,698 కోట్ల వ్యయంతో 15,795 పాఠశాలను తీర్చిదిద్దామన్నారు.

రెండో దశలో రూ.8 వేల కోట్ల వ్యయంతో 26,451 పాఠశాలల రూపురేఖలను మార్చనున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అవకతవకలతో నిర్వహించిన మధ్యాహ్న భోజన పథకాన్ని సరిదిద్ది పిల్లలకు పోషకాహారం అందించే లక్ష్యంతో రోజుకో మెనూ పేరుతో జగనన్న గోరుముద్ద పథకాన్ని రూపొందించామన్నారు. ఆ పథకం కింద రూ.1,900 కోట్ల వ్యయంతో 44 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూర్చామని అంటూ కోవిడ్‌ సమస్య ఉన్న రోజుల్లో కూడా పథకం కింద పిల్లలకు పోషకాహారాన్ని అందచేసామన్నారు. అదేవిధంగా గత 35 నెలల మధ్యకాలంలో అమ్మ ఒడి పథకం కింద రూ.13,023 కోట్ల నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లో పడే కార్యక్రమం నిర్వహించామని, వచ్చే నెలలో మరో రూ.6,400 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇక పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 5 ఏళ్ల లోపు చిన్నారుల కోసం రూ. 4,900 కోట్లు వెచ్చించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేసే ప్రణాళికలో భాగంగా పిల్లలకు యూనిఫారం, బూట్లు, బ్యాగులతో పాటు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామన్నారు.

ప్రతిపేదవాడికి ఇంగ్లీషు భాషను అందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలులోకి తెచ్చామన్నారు. విద్యారంగసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం అమలు చేసిన ఫథకాల ఫలితాలు కనిపిస్తున్నాయని అంటూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య 2018-2019 మధ్యకాలంలో 70.43 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 79 లక్షలకు పెరిగిందన్నారు. 37.20 లక్షలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య ప్రస్తుతం 44.39 లక్షలకు పెరిగిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటే తమ ప్రభుత్వం ఎటువంటి మద్యవర్తిత్వం లేకుండా రూ.1,38,894 కోట్ల నిధులు చేరుగా అర్హుల ఖాతాల్లోకి పడేలా చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement