Saturday, May 4, 2024

మాస్టర్ ప్లాన్ రోడ్డుకు పల్లవ రాణి సామావై పేరు.. ప్రారంభించిన భూమన

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఎన్నో శతాబ్దాల క్రితం తిరుమలక్షేత్ర ప్రాచుర్యానికి విశేష కృషి చేసిన పల్లవ రాణి సామావై పేరు పెట్టిన రోడ్డుకు తిరుపతిలో బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే మాస్టర్ ప్లాన్ రోడ్ల పరంపరలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ కు తూర్పు వైపుగా తిరుపతి – రేణిగుంట రైల్వే లైన్ కు ఉత్తరంగా నగరపాలక సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో 80 అడుగుల రోడ్డును నిర్మించింది. బస్టాండ్ దగ్గర ఉన్న ఎంఎస్ సుబ్బులక్ష్మి సర్కిల్ ను కరకంబాడి రోడ్డును రేణిగుంట రోడ్డుతో కలిపే అన్నమయ్య మార్గ్ ను ఈ కొత్త రోడ్డు అనుసంధానం చేస్తుంది. క్రీస్తుశకం 613 సంవత్సరం తిరుమలేశునిపై భక్తితో ఎన్నో కానుకలు సమర్పించి తిరుమలలో పలు విశేష ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన పల్లవ రాణి (రాజు దంతివర్మన్ భార్య) సామావై ఇప్పటికీ పూజలందుకుంటున్న భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించిందని శాసనాధారాలు చెబుతున్నాయి.

ఆ భక్తి చరిత్ర కు గుర్తుగా ఆమె పేరును కొత్తగా నిర్మించిన రోడ్డుకు పెట్టడం విశేషం. ఆ సామావై మార్గ్ ను తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, ఇతర కార్పొరేటర్లు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. తిరుమలేశునికి సంకీర్తనార్చన చేసి తరించిన అన్నమయ్య పేరు పెట్టిన మార్గాన్ని, ఆ స్వామి ఆస్థాన విధుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరుతో ఏర్పాటు చేసిన సర్కిల్ ను కలిపే మార్గానికి తిరుమల క్షేత్ర ప్రాచుర్యానికి నాంది పలికిన పల్లవ రాణి సామావై మార్గ్ అని నామకరణం చేయడం చెప్పుకోదగిన విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement