Saturday, April 27, 2024

Weather | ఎండ తీవ్ర‌త త‌గ్గ‌లే.. రేప‌టి నుంచి రోహిణి కార్తె ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8, పల్నాడు జిల్లా మాచర్లలో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5 అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైయస్సార్‌ జిల్లాలో 3 మండలాలు, అనకాపల్లి, నంద్యాల, ఎన్టీఆర్‌, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క మండలంలో వడగల్పులు వీచాయి. గురువారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. జూన్‌ 8వ తేదీ వరకు రోహిణి కార్తె ఉంటుంది. సాధారణంగా రోహిణి కార్తెలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రోహిణిలో ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది.

ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. రోహిణి కార్తె మరెంత ప్రభావం చూపుతోందనని భయపడుతున్నారు. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు,ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల,నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ,తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట,పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందిగా విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement