Thursday, April 18, 2024

Big Story | రామగిరి ఖిల్లా అభివృద్ధికి డీపీఆర్‌.. త్వరలో ఉన్నతస్థాయి భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చుట్టూ పచ్చని పంటపొలాలు, పక్షుల కిలకిల రావాలు, జలపాతాల గలగల మధ్యలో శత్రుదుర్భేద్యమైన గిరిదుర్గాల సమాహారం రామగిరి ఖిల్లా. తెలంగాణలోని అత్యంతప్రాచీన చరిత్ర, రాజవంశాల పాలనకు కేంద్ర బిందువైన ఈ కోటను పరిరక్షించడంలో సమైక్యపాలకులు చూపిన నిర్లక్ష్యంతో కాలగర్భంలో కలిసిపోతున్న శిల్పసంపద ను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ కోటలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పర్యాటక శాఖ సమావేశం అయిన అనంతరం డీపీఆర్‌ ను ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు. దేశంలో అనేక దుర్గాలు ఉన్నప్పటికీ ఈ కోటకు ప్రత్యేకత ఉంది. 16 కిలో మీటర్ల విస్తీర్ణంలోని అతిపెద్ద గిరిపై అనేక కోటల సమాహారంగా నిర్మించిన ఈ ఖిల్లా కు యునెస్కో అర్హతం సాధించేందుకు విస్తృత మైన అవకాశాలున్నాయి.

ఆయుర్వేద ఔషధాల వనమూలికలు ఈ కోటపైనే లభించడంతో దేశంలోని నలుమూల నుంచి ఆయుర్వేద నిజ్ఞాతులు ఇక్కడ మూలికలు సేకరిస్తుంటారు. ప్రమాదకరమైన మూలికలతో పాటుగా పరుసవేది, సంజీవిని మొక్కలు ఇక్కడే లభిస్తాయనే నమ్మకంతో తొలకరివర్షాలు పడగానే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి మూలికావైెద్యులు వస్తుంటారు. స్థలపురాణంలో మూలికల ప్రస్థావన ఉంది. ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువెళ్లుతున్నప్పడు ఆపర్వతంలోని కొంత భాగం ఈ కొండపై పడటంతో అత్యంత విలువైన ఔషధాలు ఇక్కడ లభిస్తాయని ప్రజల నమ్మకం. అలాగే సీతారాములు ఇక్కడ కొంతకాలం వనవాసం చేయడంతో రామగిరి పేరువచ్చిందని ప్రచారంలో ఉన్న కథనం.

ప్రాచీన కళావైభవానికి ప్రతీక రామగిరిఖిల్లా క్రీపూర్వంనుంచి నిజాం ఏలుబడివరకు అనేక రాజవంశాలు పాలించాయి. పురావస్తు తవ్వకాల్లో లభించినశాసనాధారాల మేరకు రామగిరిఖిల్లాను క్రీస్తు పూర్వం మౌర్య చంద్రగుప్తుడు, బింబిసారుడు, అశోకుడి పాలనలో అంతర్భాగంగా రహస్య సైనిక శిక్షణ కేంద్రంగా విరాజిల్లింది. అనంతరం క్రీ.శ. 1158లో చాళుక్య గుండరాజు ఆధీనంలో ఉండగా కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకుని శత్రుదుర్భేద్యంగా తీర్చి దిద్దారు. రామగిరి కాకతీయుల ఆధీనంలో ఉన్నట్లు మంత్రకూటమి శాసనాల్లో ప్రస్థావన ఉంది. దేశంలో ఏ కోటకు లేని రహస్యమార్గాలు అనేకం ఇక్కడ ఉన్నాయి గమ్యం తెలియని సొరంగాలు కోటకు సొంతం నిత్యం నిధుల అన్వేషణలో చారిత్రిక సంపద వాడిగునపాలదెబ్బలకు చెల్లాచెదురుఅవుతున్నాయి. 16 కిలోమీటర్ల విస్థీర్ణంలో కొలువైన ఈ కోటల్లో రామగిరి ప్రధాన దుర్గం కాగా అంతర్భాగంగా సాలుకోట, సింహాల కోట, జంగేటి కోట, ప్రతాపరుద్రకోట, అతిపెద్ద అశ్వశాల, కొలువుల వేదికలు, మొఘల్‌ దర్భార్‌, గజశాల, వేయికి పైగా ఒకే సారి భోజనం చేసేందుకు మలిక సదుపాయాలున్న భోజన శాల, ప్రధాన సభ స్థలి రామగిరికి మాత్రమే సొంతం.

- Advertisement -

అలాగే నాడు వనమూలికలతో వైద్యం చేసిన పసరుబావి, అంతుచిక్కని రహస్య సొరంగ మార్గాలు రామగిరి లో ఉన్నాయి. దేశంలో కోటలు ఉన్నప్పటికీ అనేక కోటల సమాహారం మాత్రం రామగిరికే సొంతం కావడంతో యునెస్కో అవార్డుకు అర్హత కలిగి ఉంది. క్రీ.శ. 1323 లో కాకతీయ వంశ పాలన అంతం కావడంతో తిరిగి ఢిల్లిdసుల్తానులకు వ్యతిరేకంగా కాకతీయుల 77 మంది పాలెగాళ్లు పోరాటం చేసి తిరిగి ఒరుగల్లును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆవీరులు చిన్నచిన్న రాజ్యాలను స్థాపించి సొంత పాలన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురజాల కమ్మ వంశీలు, ముసునూరి కమ్మరాజుల ఆధ్వర్యంలో 1687 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆతర్వాత ఔరంగా జేబు పాలనలోకి రామగిరి వెళ్లింది. అనంతరం 1948 సెప్టెంబర్‌ 17 వరకు నిజాంమీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆధీనంలో ఉంది.అనేక రాజవంశాలు రామగిరిని పాలించినప్పటికీ క-ోటపై ఉన్న సీరామచంద్ర ఆలయాన్ని కాపాడారు.

గిరిప్రదర్శనకు ఏర్పాట్లు
దేశంలోని అత్యంత చారిత్రాత్మకమైన గిరిదుర్గాల్లో మొదటి వరుసలో నిలిచిన రామగిరిఖిల్లా పై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ చెప్పారు. ఈ కోట చుట్టూ గిరి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తే ఔషధ మూలికల ప్రభావంతో ప్రజలు మరింత ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ కోటల సముదాయంలో రోప్‌ వే, గిరిప్రదక్షిణ, పర్వతారోహణ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి సీఎం అనుమతితో పనులు ప్రారంభించనున్నట్లు చెపారు. యునెస్కో గుర్తింపుకోసం నివేదికలు రూపొందించనున్నట్లు గెల్లు చెప్పారు. పురావస్తు శాఖ ఆధినంలో సొరంగాల అన్వేషణ చేయాల్సిన అవసంరం ఉందన్నారు. అంతుచిక్కని ఈ సొరంగాల్లోకి ప్రజలు వెళ్లితే ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకరంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు రామగిరి ఖిల్లాకుఉన్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement