Friday, April 26, 2024

నెరవేరబోతున్న ఆర్టీసీ ఉద్యోగుల కల.. మరో నాలుగు రోజుల్లో పీఆర్సీ అమలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అక్టోబర్‌ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ జీతాలు మరో నాలుగు రోజుల్లో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పదోన్నతి పొందిన 2094 మంది ఉద్యోగులకు మినహా..మిగిలిన వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అక్టోబర్‌ 1వ తేదీన కొత్త జీతాలు ప్రభుత్వం ఇవ్వనుంది. పదోన్నతి పొందిన వారికి నవంబర్‌ 1వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి హోదాను బట్టి రూ.3వేల నుంచి రూ.6వేల వరకు కొత్త పీఆర్సీలో జీతాలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీలోని 50వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు అధికారులు చెపుతున్నారు. వేతన సవరణ ప్రకటించి నెలలు గడుస్తున్నా కొత్త జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేక చొరవ తీసుకొని ఉన్నతస్థాయి చర్చల ద్వారా ఎట్టకేలకు సమస్యను కొలిక్కి తెచ్చారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో తాము కూడా జీతాలు అందుకోనుండటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, బస్సుల నిర్వహణ వంటి కారణాలతో తరుచూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు వేతనాలు పెంచేందుకు కూడా సంస్థ యాజమాన్యం అంగీకరించేది కాదు. జీతాలు కూడా ఒక్కొక్కసారి జాప్యం జరిగేది. ఈ క్రమంలోనే తమను కార్పోరేషన్‌ నుంచి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉద్యోగులు కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం ముందుకు వచ్చేది కాదు. ఈ క్రమంలోనే 2019కు ముందు వైఎస్‌ జగన్మోహన రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సమయంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు కలిసి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ వినతి పత్రాలు అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల స్థితిగతులను సమగ్రంగా పరిశీలించిన జగన్మోహన రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తానంటూ పాదయాత్ర సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ విలీనంపై పలు కమిటీలు వేసి నివేదిక తెప్పించారు. సంస్థను ఆర్టీసీలో విలీనం చేసేందుకు ఉన్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపధ్యంలో రవాణాశాఖలో ప్రజా రవాణా శాఖ(పీటీడీ)ని ఏర్పాటు చేసి ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటికే పీఆర్సీ కమిషన్‌ వేసి ఉండటంతో ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకొని పీఆర్సీ నివేదిక ఇవ్వాలంటూ అష్‌తోష్‌ మిశ్రా కమిటీకి సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై కమిష న్‌ నివేదిక ఇచ్చింది.

ఆందోళనకు గురి చేసిన జాప్యం..

- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు జాప్యం కావడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేసింది. ఫిట్‌మెంట్‌ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాకుండా మూడు నెలలు ఆలస్యంగా ప్రకటించారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నాలుగు నెలల కిందట కొత్త వేతన సవరణ చేశారు. అప్పటి నుంచి రకరకాల కారణాలతో అమలును ఆర్థిక శాఖ వాయిదా వేస్తూ వస్తోంది. నెలలు గడుస్తున్నా కొత్త జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు లోనయ్యారు. పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు అటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఇటు ఆర్థిక శాఖ అధికారులను సైతం కలిసి కొత్త జీతాల కోసం వినతి పత్రాలు ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరపడం ద్వారా ఎట్టకేలకు మార్గం సుగగమైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త జీతాలు అందుకోనున్నామనే ఆనందం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement