Sunday, April 28, 2024

ప’రేషాన్‌’.. పండగవేళ రేషన్‌లో కోతలు

అమరావతి, ఆంధ్రప్రభ: పండగ వేళ రేషన్‌ పరేషాన్‌ అవుతోంది. అక్టోబర్‌ నెల రేషన్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కందిపప్పు, పంచదార సరఫరాల్లో కొర్రీ పెట్టనున్నట్లు సమాచారం. ఈమేరకు డీలర్లు కేవలం బియ్యానికి మాత్రమే డీడీలు తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా రేషన్‌ సరఫరా అస్తవ్యస్థంగా మారిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 29,970 షాపులు ఉంటే కేవలం 20 శాతం షాపుల ద్వారా మాత్రమే ఈనెల్లో కందిపప్పు, పంచదార సరఫరా జరుగినట్లు తెలుస్తోంది. అదేమంటే స్టాక్‌ అయిపోయిందనో, ఇంకా రాలేదని ఎండీయూ ఆపరేటర్లు కుంటి సాకులు చెప్పి కవర్‌ చేసేశారు. గతనెల్లో కందిపప్పు, పంచదార కోసం డీలర్లు డీడీలు కట్టినప్పటికీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరుకు సరఫరా కాలేదని తెలుస్తోంది. దీంతో వచ్చే నెలకు సంబంధించి డీలర్లు కందిపప్పు, పంచదారకు చెల్లింపులు జరపలేదని తెలుస్తోంది.

గడిచిన రెండు నెలలుగా కందిపప్పుకు సంబంధించి టెండర్‌ ఖరారు కాకపోవడం వల్లే సరఫరాకు విఘాతం కలిగినట్లు వికినిడి. కేజీ కందిపప్పుకు రూ.128 కోడ్‌ చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మారిన ధరల దృష్ట్యా ఇంతకుమించి తక్కువకు సరఫరా చేయలేమని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు భోగట్టా. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్లో నిధుల లేమి కారణంగానే భేరసారాలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేషన్‌ సరఫరాలో భాగంగా గతంలో కొనుగోలు చేసిన కందిపప్పుకు సంబంధించి కొందరు మిల్లర్లకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు కందిపప్పు సరఫరా చేసేందుకు మిల్లర్లు బాప్‌రే అని చేతులెత్తేశారని సమాచారం. అసలు కథ ఇలా ఉంటే ఎండీయూ ఆపరేటర్లు మాత్రం ఈసారి స్టాక్‌ రాలేదని బియ్యం ఇచ్చి చేతులు దులుపుకెళ్ళిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్‌ సరుకులంటే గతంలో బియ్యం దగ్గర నుంచి పప్పు, ఉప్పు, చింతపండు, పంచదారతో పాటు పండగల వేళ నెయ్యి ప్యాకెట్‌, బెల్లం, సేమియా వంటి వాటిని సరఫరా చేసేవాళ్ళు. సహజంగా పండగంటే బంధువుల రాకపోకలు ఉంటాయి కాబట్టి, పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఈ జంబో ప్యాకెట్‌ ఎంతో ఉపయోగపడేది. క్రమేణా ఈవిధానంలో మార్పు వచ్చింది. బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే పంపిణీ జరుగుతోంది.

గడిచిన రెండు నెలలుగా కందిపపపు, పంచదార పంపిణీలో కూడా కోతలు పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. నిత్యవసర వస్తువులు మార్కెట్‌లో మండుతున్న వేళ రేషన్లో కోతలు పేదవర్గాల్ని మరింతగా కుంగదీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే రేషన్‌ సరఫరా అంతా బాగు..బాగు అని చెప్పడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ పనితీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పాలన గాడి తప్పుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రకరకాల సాకులు చెబుతూ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం కాటా వేయకుండానే పంపుతున్నారని దీనివల్ల ఒక్కో షాపుకు రెండు క్వింటాళ్ళ తరుగువస్తోందని డీలర్లు వాపోతున్నారు. సరుకు ఎండీయూ ఆపరేటర్ల నుంచి కార్డుదారుల చేతికి అందేసరికి ఆ తరుగు కవర్‌ అయిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి.

గడిచిన రెండు నెలలుగా కందిపప్పు, పంచదార అరకొరగా సరఫరా జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఎండీయూ ఆపరేటర్లు నో స్టాక్‌ అని చెప్పే సరికి పేదలు అది నిజమేనేమో అని సరిపెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్‌ పంపిణీ ఎలా జరుగుతోందనే దానిపై సరైన పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ పోస్‌ యంత్రాలు, కాటాలు మరమ్మతులు, స్పేర్‌ పార్ట్‌ ధరల పట్టికను ప్రతి యంఎల్‌ఎస్‌ పాయంట్లోను, తహశీల్దార్‌, ఏఎస్‌ఓ కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ 50 శాతానికి మించి కనిపించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన కాటాలకు తయారీ కంపెనీలకు వాటి ఏజన్సీలు సంవత్సరానికి ఒకసారి 600 రూపాయాలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అస్తవ్యస్థంగా మారుతున్న రేషన్‌ పంపిణీ విధానంపై ప్రభుత్వం దృష్టిసారించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement