Friday, April 26, 2024

తీవ్ర సంక్షోభంలో రైతాంగం, అన్నదాతలకు అండగా తెలుగుదేశం

అమరావతి, ఆంధ్రప్రభ : వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతుండగా.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు కోసం తెలుగుదేశం పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలిపారు. రైతులు అప్పులు, పండించిన పంటకు సరైన ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిత్యం ఇద్దరు, ముగ్గురు రైతులు బలవన్మారణాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలబడిందని దీంతోనే వ్యవసాయ రంగంపై వైకాపాకు ఉన్న నిబద్ధతను, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రైతు కోసం తెలుగుదేశం కమిటీ అన్నదాతలకు అండగా నిలిచి వారికి పరిహారం అందేలా పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్‌ రెడ్డి, కూన రవికుమార్‌, తెలుగురైతు విభాగం అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement