Sunday, May 19, 2024

ఆక్వా సాగుకు సబ్సిడీ ఊరట.. అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూములకు వర్తింపు

అమరావతి, ఆంధ్రప్రభ : అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీ-వల ప్రకటించిన విద్యుత్‌ సబ్సిడీని నాన్‌ ఆక్వాజోన్‌ లోని రైతులకు కూడా వర్తింపచేసేందుకు అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు నిర్దేశిత నిబంధనల ప్రకారం నాన్‌ ఆక్వాజోన్‌ లోని అర్హత ఉన్న రైతుల భూములు ఆక్వాజోన్‌ పరిధిలోకి మారనున్నాయి. ఆక్వా జోన్‌ పరిధిలోకి నాన్‌ ఆక్వా జోన్‌ భూములు మారిన వెంటనే ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్‌ సబ్సిడీ అమలు కానుంది. కేవలం యూనిట్‌ ను రూ 1.50 పైసలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల మార్చిలో వచ్చే ఫిబ్రవరి బిల్లు నుంచే సబ్సిడీని అమలు కానుంది. ఈ మేరకు జిల్లాల వారీగాగా నాన్‌ ఆక్వాజోన్‌ భూములను గుర్తించి ఆక్వాజోన్‌ లోకి మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విద్యుత్‌ సబ్సిడీ అమల్లో ఉన్నప్పటికీ అందరికీ వర్తింపచేసేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో ఏళ్ళుగా ఆక్వా సాగులో ఉన్న వందలాది ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని వెబ్‌ ల్యాండ్‌ లో అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూములుగా నమోదయి ఉండటంతో విద్యుత్‌ సబ్సిడీ వర్తించలేదు.

- Advertisement -

ఆ భూముల్లో ఆక్వా సాగు చేపడుతున్న వారంతా సన్న, చిన్నకారు రైతులు.. వారిలోనూ మత్స్యకారులు, ఇతర బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన వారే అధికం. ఈ నేపథ్యంలో విద్యుత్‌ చార్జీలు భారమై ఆక్వా సాగులో వారంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా సాంకేతికంగా సమస్య పరిష్కారం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో 10 ఎకరాల లోపు ఆక్వా సాగు చేస్తున్న వారందరికీ విద్యుత్‌ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను నూటికి నూరు శాతం అమలు కావాలంటే నాన్‌ ఆక్వా జోన్‌ లోని ఆక్వాసాగు భూములు ఇపుడు ఆక్వా జోన్‌ ఫరిధిలోకి రావాల్సి ఉంటు-ంది. అందులోనూ 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేస్తున్న రైతులను గుర్తించాలి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు భూమి రికార్డులు, సాగు విస్తీర్ణం ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

గ్రామసభల్లో గుర్తింపు.. డిస్కంలకు జాబితాలు

విద్యుత్‌ సబ్సిడీని అమలు చేసేందుకు అర్హత కలిగిన ఆక్వా రైతుల జాబితాలను డిస్కంలకు పంపించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆక్వా జోన్‌ లోకి మార్చిన నాన్‌ ఆక్వా భూములను ఎక్కడికక్కడ గ్రామసభతో పాటు- జిల్లా స్థాయికమిటీ-ల్లో గుర్తించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం నోటిఫైడ్‌ ఆక్వా జోన్‌ పరిధిలో 2,49,348 ఎకరాల్లో 1,00,792 మంది సాగు చేస్తుండగా వారిలో 98,095 మంది పదెకరాల్లోపే సాగు చేస్తున్నారు. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలో 74,419 మంది 1,28,095 ఎకరాల్లో సాగు చేస్తుండగా వారిలో 10 ఎకరాల్లోపు సాగు విస్తీర్ణం కలిగిన రైతులు 76,413 మంది ఉన్నారు. ఇప్పటివరకు సేకరించిన సర్వే ఆధారంగా అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో ఆక్వా సాగు చేస్తున్న సగటు- విస్తీర్ణం కేవలం 2 నుంచి 3 ఎకరాల్లోపే అధికంగా ఉంది. పది ఎకరాల గరిష్ట విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతుల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఒక వైపు సీడ్‌, ఫీడ్‌ ధరలు బాగా పెరిగి ఆక్వా ఖరీదయిన సాగుగా మారిన నేపథ్యంలో స్వల్ప విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనంగా ఉందని ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement