Friday, May 3, 2024

దొంగలించడం..హతమార్చడం..పార్థీ గ్యాంగ్‌ పనేనా?

అనంత‌పురం జిల్లా కదిరిలో దోపిడి దొంగల బీభత్సంలో గోన్‌ పార్థీ గ్యాంగ్‌ హస్తం ఉందా అనే అనుమానాలను పోలీసువర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మాములుగా ఉజిపురం గ్యాంగ్‌ చేసే నేరాలు భిన్నంగా ఉంటాయని, గోన్ పార్థీ గ్యాంగ్‌ ముఠా సభ్యులు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వారు. వీరి నేరాలు చాలా క్రూరంగా ఉంటాయి. మొదట మహిళలను రెక్కి నిర్వహించి విషయాలను ఆరా తీస్తారు. తర్వాత ఐదు నుంచి ఏడు మందికి పైగా సభ్యులున్న ముఠా ఒక్కసారి ఇంటిపై దాడి చేస్తుంది. దాడి చేసి దోచుకున్న తర్వాత క్రూరంగా హత్యచేసి ఆ రక్తాన్ని గోడలకు చల్లి పారిపోతారు. వీరు ఆఫీసర్ల తరహాలో ఇన్‌షర్ట్‌ చేసుకుని, చాలా నీట్‌గా ఉంటారు. వారిని నేరస్తులుగా ఏ ఒక్కరూ అనుమానించే అవకాశం లేకుండా వ్యవహరిస్తారు. వీరి గురించి స్టేట్‌, సెంట్రల్‌ క్రైం బ్యూరో నిఘా పెడుతుంది. భహర్యా గ్యాంగ్‌ అని మరోకటి ఉంటుంది. వీరు చిన్నపాటి పిస్టళ్లు, ఇతర ఆయుధాలను కలిగి నేరాలకు పాల్పడుతారు. నేరం చేసిన తర్వాత పరిస్థితిని బట్టి కాల్పులను జరుపుతారు. భహర్య గ్యాంగ్‌ కదిరిలో జరిగిన నేరాన్ని బట్టి వారి ప్రమేయం తక్కువగా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. గోన్‌పార్థీ గ్యాంగ్‌ మనుషులను చంపే స్వభావం ఉంటుందని, మిగిలిన వారి భయాత్పాతానికి గురి చేసేందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంటారని చెబుతున్నారు.

ఇలా పోలీసుల కన్నుగ‌ప్పి నేరాలు చేసి పారిపోయి పట్టుకోండి అని సవాల్‌ విసిరిపోతారని పదవీ విరమణ చేసిన సీనియర్‌ పోలీసు అధికారి తన అనుభవ పూర్వకంగా వివరించారు. ఇదే గ్యాంగ్ ప‌నేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కదిరి ఎన్‌ జిఓ కాలనీలో ఉపాధ్యాయుడు శంకర్‌ రెడ్డి ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించి ఆయన భార్య ఉషా దేవి (46)ను హతమార్చారు. శంకర్‌ రెడ్డి వాకింగ్ కు వెళ్లగా..టీచర్‌ ఉమాదేవి ఇంట్లో ఉన్నారు. ఆయన వెళ్లిన వెంటనే దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె ప్రతి ఘటించడంతో తమ వద్ద ఉన్న పదునైన ఆయుధంతో కొట్టి హతమార్చారు. అక్కడి నుంచి నగలను తీసుకెళుతుండగా.. ఎదురింట్లో ఉన్న మహిళ గమనించడంతో ఆమెపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న నగలు లాక్కున్నారు. ఇంట్లో ఉన్న కుమారుడు, కోడలు గదికి తాళం వేసి శివమ్మపై దాడి చేశారు. ఆమె అపస్మారక స్థిలోకి వెళ్లిపోయారు. ఈమె భర్త రమణ స్థానిక కాలేజి సర్కిల్లో టీ కొట్టు నడుపుతుంటారు. ఆయన సైతం తెల్లవారు జామునే టీకొట్టుకు వెళ్లిపోయారు. వాకింగ్‌ కు వెళ్లి వచ్చిన శంకర్‌ రెడ్డి తన భార్య ఉష అఛేతనంగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి విచారించిన తర్వాత ఇది దోపిడి దొంగల పనే అని గుర్తించారు. కదిరిలో దోపిడి దొంగల వ్యవహారంపై జిల్లా ఎస్సీ తీవ్రంగా స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించడమే కాకుండా జరిగిన నేరానికి సంబంధించి పరిశోధన చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌, స్క్వాడ్‌ తో తనిఖీ చేయించారు. డాగ్‌ కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. నేరుస్తుల అనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. అయితే నేరానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు వదిలిపెట్టవద్దని పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

ఇదిలా ఉండగా పాత నేరస్తులు, ఇటువంటి దొంగతనాలకు పాల్పడేవారిపై నిఘాపెట్టారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ, అనుమానితుల గురించి ఆరాదీశారు. 50 తులాలకు పైగా టీచర్‌ శంకర్‌ రెడ్డి ఇంటిలో బంగారు అపహరణకు గురైందని ప్రాథమికంగా నిర్ధారించారు. రమణ ఇంటిలో ఎంత పోయినది గుర్తించలేదు. ఆయన భార్య తీవ్ర గాయాలతో ఉండడం వల్ల ఆమె కోలుకుని పరిస్థితి వివరిస్తే తప్ప దోపిడి దొంగలు ఏ భాషలో మాట్లాడారు.. వారి కట్టుబొట్టు, వస్త్ర ధారణ ఎలా ఉందని పోలీసులు గుర్తించే అవకాశం ఉంటుంది. వీరే కాకుండా స్థానికంగా ఉన్న గ్యాంగ్‌లు కూడా ఇటువంటి నేరానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. శంకర్‌ రెడ్డి ఆయన భార్య ఉషా ఇద్దరు ఉపాధ్యాయులు కావడం వల్ల వారి ఆదాయ వ్యవహరాలు, ఇతర విషయాలు బాగా గుర్తించి, పక్కా ప్లాన్‌ ప్రకారం దోపిడి చేసి, టీచర్‌ ఉషాను హతమార్చేశారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు ఈ హత్య పై ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీని కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. మాములుగా ఉపాధ్యాయులు గాని.. ఇతర వ్యక్తులు బంగారాన్ని ఇళ్లలో పెట్టుకోరు. బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటారు. అయితే.. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో పూజా కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలకు మహిళలు వెళ్తుంటారు. పూజల కోసం నగలు వేసుకునేందుకు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటారు.

దీంతో శంకర్‌ రెడ్డి కుటుంబం ఆ విధంగానే తెచ్చుకునే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవ విషయాలు పూర్తి స్థాయిలో విచారిస్తే తప్ప బయటపడే అవకాశం లేదు. ఈ నేరానికి పాల్పడిన వారు శివారు ప్రాంతాల పై ఎక్కువగా దృష్టి పెడుతారని, ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కదిరి ఎన్జీఓ కాలనీలో ప్రారంభం నుంచే తరుచు దొంగతనాలు జరిగేవి. దీంతో ఆ ప్రాంతంలో దొంగతనాలు, దోపిడిలు నివారించేందుకు గతంలో డిఎస్పీ కార్యాలయాన్ని ఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిఎస్పీ కార్యాలయాన్ని హిందూపురం రోడ్డులో ప్రభుత్వ స్థలంలో నిర్మించడంతో కార్యాలయం అక్కడికి తరలివెళ్లింది. పోలీసుల నిఘా తగ్గింది. ఎన్జీఓ కాలనీలో ఎక్కువ మంది ఉద్యోగులు నివసిస్తున్నారు. శివారు ప్రాంతం కావడంతో తరుచు దొంగతనాలు జరిగేవి. డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు వల్ల చాలా కాలం పాటు దొంగతనాలు నియంత్రణలో ఉన్నాయి. ప్రస్తుతం తిరిగి ఈ హత్యలతో ఎన్జీఓ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా గస్తీని మరింత పటిష్టం చేయాల్సి ఉందని పోలీసులకు స్థానికులు విన్నవిస్తున్నారు. ఇంకా దండుపాలెం, హూజీకుప్పం తదితర గ్యాంగ్‌లపై నిఘా పెడితే నేరస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement