Thursday, May 2, 2024

Big Story: అడుగంటుతున్న శ్రీశైలం జలాశయం.. కనిష్టానికి చేరిన నీటిమట్టం..

సాగు, తాగునీటి అవసరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నీటి మట్టం పూర్తిస్థాయిలో అడుగంటింది. ఎగువ నుంచి వచ్చి చేరే వరద జలాల ఉధృతి నిలిచిపోయింది. సోమవారం రాత్రి వరకు ఉన్న అధికారిక సమాచారం మేరకు ఎగువ ప్రాంతం నుంచి కొంచెం నీరు కూడా రిజర్వాయర్‌కు వచ్చి చేరటం లేదు.

అమరావతి, ఆంధ్రప్రభ : శ్రీశైలం రిజర్వాయర్​ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీ-ఎంసీలు కాగా..రిజర్వాయర్‌ లో సోమవారం రాత్రికి కేవలం 31.25 టీ-ఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి దిగువన నాగార్జున సాగర్‌, పులిచింతల రిజర్వాయర్లకు నీటిని వదిలి నిల్వ చేసినా అవి కూడా క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ లో నీరు లేకపోవటంతో దిగువకు వదిలే అవకాశం లేకపోవటం, ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని అవసరాల మేరకు ఆలస్యంగా మొదలైన రబీ పంటలకు వదులుతుండటంతో సాగర్‌, పులిచింతల్లోని నిల్వలు తగ్గిపోతున్నాయి.

నీటి అవసరాలు ఎక్కువగా ఉండే పంటల సాగు వీలైనంత తొందరగా పూర్తయితే వేసవి అవసరాలను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌లో మాత్రం సామర్థ్యం మేరకు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ సామర్థ్యం కేవలం 3.07 టీ-ఎంసీలు. అయినా పూర్తిస్థాయిలో నిల్వలున్నాయి. నాగార్జున సాగర్‌ సామర్థ్యం 312 టీ-ఎంసీలకు గాను 271 టీ-ఎంసీలు, పులిచింతలలో 45.77 టీ-ఎంసీలకు గాను 38.5 టీ-ఎంసీల నిల్వలున్నాయి. శ్రీశైలంలో నీటి సంవత్సరం ప్రారంభమైన గత ఏడాది జూన్‌ నుంచి ఎగువ నుంచి వరద నీరు పో-టె-త్తింది. 2021-22లో 1,118 టీ-ఎంసీల వరద నీరు వచ్చి చేరగా..కృష్ణా బేసిన్‌ లోని అన్ని ప్రాంతాల్లోని భారీ, మధ్య, చిన్నతరహా రిజర్వాయర్లకు నీటిని వదిలారు. భారీ వర్షాల రూపంలో సాధారణ స్థాయి కన్నా అధికంగా నమోదయిన వర్షపాతం వల్ల 5,614.73 టీ-ఎంసీల నీరు గత ఏడాది జూన్‌ నుంచి అందుబాటు-లోకి రావటం మరింత కలిసొచ్చింది. నాగార్జున సాగర్‌, పులిచింతలతో పాటు- పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా,ఇతర దిగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు కూడా నీటిని చేరవేశారు. 252 టీ-ఎంసీలను వినియోగించి శ్రీశైలం కుడిగట్టు- విద్యుత్‌ కేంద్రం ద్వారా జలవిద్యుదుత్పత్తి చేయగలిగారు.

ఆ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇలా…
రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 647.01 టీ-ఎంసీలు కాగా..నీటి నిల్వలు 65.79 శాతానికి తగ్గుముఖం పట్టాయి. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589.67 టీ-ఎంసీలు కాగా నీటి నిల్వలు 355.04 టీ-ఎంసీలు..60.21 శాతానికి చేరుకున్నాయి. పెన్నా బేసిన్‌ రిజర్వాయర్ల సామర్థ్యం 239.59 టీ-ఎంసీలు కాగా 185.15 టీ-ఎంసీలు..77.28 శాతానికి నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో భారీ రిజర్వాయర్ల నీటి సామర్థం 865.64 టీ-ఎంసీలు కాగా..564.81 టీ-ఎంసీలు..65.26 శాతానికీ, మధ్య తరహా రిజర్వాయర్ల సామర్థ్యం 115.09 టీ-ఎంసీలు కాగా 80.74 టీ-ఎంసీలు..70.15 శాతానికి నిల్వలు చేరుకున్నాయి. రాష్ట్రంలోని 38385 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో 146.33 టీ-ఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద నీటి ఉధృతి కనీస స్థాయికి పడిపోతూ ఉండటం, రిజర్వాయర్లలో నీటిని ఇంకా రబీ కోసం విడుదల చేస్తున్న నేపథ్యంలో రానున్న మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీటి మట్టం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు- అంచనా.

vo
Advertisement

తాజా వార్తలు

Advertisement