Sunday, May 19, 2024

ఘాటు తగ్గని పచ్చిమిర్చి.. కిలో రూ.100కు పైనే

అమరావతి,ఆంధ్రప్రభ : పచ్చిమిర్చి ఘాటు నెల రోజుల నుంచి తగ్గడం లేదు.. కోసి తినకుండానే మంట పుట్టిస్తోంది. రకాల కూరల్లో పచ్చిమిర్చిని ఉపయోగిస్తుంటాం. వీటి ధరలు రోజు రోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి.విపరీతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. పచ్చిమిర్చి ధర గత కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పచ్చిమిర్చి ధర రూ.120 వరకు పలుకుతోంది. ఇదే పరిస్థితి ఇంకా నెల రోజుల పాటు- కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం స్థానికంగా పచ్చిమిర్చి పంట లభ్యం కాకపోవడం వల్లే ధరలు అమాంతం పెరిగేందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -

వేసవిలో ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. గతంలో గుంటూరు హోల్‌సేల్‌ మార్కెటు 1000 బస్తాల వరకు పచ్చిమిర్చి వచ్చేది. గుంటూరుతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి ప్రస్తుతం సరకు వచ్చే పరిస్థితి లేదు. సీజన్‌లో గుంటూరుతో పాటు బాపట్ల, రేపల్లె, గిద్దలూరు తదితర ప్రాంతాల నుంచి మార్కెటు పచ్చిమిర్చి వచ్చేది.

ఇప్పుడు అన్‌ సీజన్‌ కావడంతో కడప జిల్లాలోని పులివెందుల, బాలావారిపల్లి తదితర ప్రాంతాల నుంచి మాత్రమే వస్తోంది. ప్రస్తుతం సరఫరా సగానికి సగం పడిపోయింది. 500 బస్తాలు రావడమే గగనమైపోతోంది. ఈసారి ఉత్పత్తి తగ్గిపోవడంతో బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోయింది. ఈ కారణాలతో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు పచ్చిమిర్చిని పెద్దగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement