Thursday, May 2, 2024

Letter to CM: పవర్​ స్టేషన్​ మూసేయండి…సీఎం జగన్​కు రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి లేఖ

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్): పవర్​ ప్రాజెక్టుతో జనాలు హెల్త్​ ఇష్యూస్​తో బాధపడుతున్నారు. విపరీతమైన కాలుష్యంతో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. విష వాయువులతో ఆరోగ్యానికి ముప్ప వస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నార్ల తాతారావు థర్మల్​ పవర్​ స్టేషన్​ని మూసేయాలి. లేదంటే కాలుష్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి అని సీఎం జగన్​కు ఓ రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ వైరల్​గా మారింది.

డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) వెదజల్లుతున్న కాలుష్య నివారణపై చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీసీబీకి ఆదేశాలు జారీ చేయాలని రిటైర్డ్​ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్​కు మెయిల్​లో లేఖ పంపారు. ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి వాతావరణంలో విష వాయువులను వెదజల్లుతూ, జలవనరుల్లో కాలుష్యం వదలడంతో చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయాన్ని రెండు నెలల క్రితం ఏపీపీసీబీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదన్నారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఎన్టీటీపీఎస్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడు ఆరోగ్య పరిస్థితులను వివరించారన్నారు. ఎన్టీటీపీఎస్ వెదజల్లుతున్న కాలుష్యాన్ని ప్రభుత్వం నియంత్రించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారన్నారు. ప్లాంట్ నుంచి వెలువడే విష వాయువులను నియంత్రించేందుకు ఏపీ జెన్ కో ప్లాంట్ చుట్టూ 70 ఎకరాల్లో హరిత హారం రూపంలో చెట్లను పెంచాలని సూచించారు.

- Advertisement -

పరిసర గ్రామాల్లో డేంజర్​ బెల్స్​..

2015, 2019లో ఎన్టీటీపీఎస్ ఐదో స్టేజికి అనుమతులు ఇస్తూ కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనలు విధించిందని గుర్తు చేశారు. ప్లాంట్ పరిసరాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఉపరితల, భూగర్భ జల వనరులలో పాదరసం, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, సల్ఫర్ వంటి విష పదార్థాలు వాతావరణంలో సల్ఫర్, నైట్రోజన్ కాలుష్యం ఎంతవరకు ఉందో ఎప్పటికప్పుడు ఏపీ జెన్ కో సాంకేతిక పరికరాల సాయంతో మానిటర్ చేయాల్సి ఉందన్నారు. ఈ నిబంధనలు ఏపీ జెన్ కో ఉల్లంఘించిన విషయం ఏపీపీసీబీకి తెలుసన్నారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని ఏపీపీసీబీ దృష్టికి వెళ్లినా ఆ సంస్థ ఏపీ జెన్ కో పై గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చూపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి వద్దు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరించిందని విమర్శించారు. ఎన్టీటీపీఎస్ వల్ల కలుగుతున్న కాలుష్యం, అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలపై ఉమ్మడి కృష్ణాజిల్లా ఉన్నతాధికారులు ఇంతవరకు ప్రభుత్వానికి తెలియజేయకపోవడం చాలా ఆశ్చర్యకరమన్నారు. జల వనరులలో, గాలిలో కాలుష్యాన్ని అరికట్టే బాధ్యత చట్టపరంగా ఏపీపీసీబీకి ఉన్నా ఆ బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా సంతృప్తికరంగా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. ఆ సంస్థకు అయ్యే ఖర్చులు ప్రజలు భరిస్తున్నా జవాబుదారీగా పనిచేయడం లేదన్నారు. కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.‌ ఎన్టీటీపీఎస్ వలన కలుగుతున్న కాలుష్యాన్ని కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా అరికట్టాలని లేనిపక్షంలో ప్లాంట్ ను మూసివేయాల్సిందిగా ఏపీ జెన్ కోకు ఏపీపీసీబీ షోకాజ్ నోటీసు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

70 ఎకరాల్లో హరితహారం చేపట్టాలి..

70 ఎకరాల్లో హరితహారం రూపంలో చెట్లు నాటకపోతే ఏపీపీసీబీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందని ఏపీ జెన్ కోను హెచ్చరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీటీపీఎస్ పరిసర గ్రామాల్లో ఏపీపీసీబీ విస్తృతమైన హెల్త్ సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి కలుగుతున్న హాని, వారి పరీక్షలు, చికిత్స విషయంలో ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సహాయం వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించిన ఏపీపీసీబీ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజల ఆరోగ్యానికి వారి సంక్షేమానికి సంబంధించిన విషయమని గుర్తించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement