Sunday, May 19, 2024

ఇటు గుడారం.. అటు సింగారం.. సీఎం రాకతో ముస్తాబు..

ప్రభన్యూస్ : భారీవర్షాలు, వరదలతో ఇళ్లతో సహా సర్వశ్వం కోల్పోయిన బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో సహాయం అందడం లేదు. నిలువనీడ లేక అలమటిస్తున్న బాధితులకు గుడారాల పేరుతో వేసిన ప్లాస్టిక్‌ కవర్‌ టెంట్లు చిన్న గాలివీచినా పడిపోతున్నాయి. తాత్కాలిక ఏర్పాట్ల పేరుతో అధికారులు తీసుకుంటున్న చర్యలు విమర్శల పాలవుతున్నాయి. బాధితులపట్ల కనికరం కూడా లేని అధికారులు మాత్రం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి అంతా బాగుందని చెప్పుకునేలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కష్టాల్లో బాధితులు మగ్గుతూంటే… రోడ్ల మరమ్మతులు, భవనాలకు రంగులు, రోడ్లకు ఇరువైపులా శానిటేషన్‌ వంటి చర్యలతో అధికారులు ఉరుకుతున్నారు. 15 రోజులుగా వీరు పడుతున్న పాట్లు, అవస్థలు దేవునికే ఎరుక. ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని ఒకవైపు చెబుతూనే మరోవైపు కొంతమందికి మొండి చేయి చూపుతున్నారు.

అధికారుల లెక్కల ప్రకారం 31 గ్రామాలలో 1234 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. వీటిలో కూడా రెండు మూడు వందల కుటుంబాలకైనా పరిహారం అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పగటిపూటంతా ఏదోలా గడిపేసినా చీకటిపడితే భయమేస్తోంది. ఉండీ లేనట్టుండే గుడారాలలో తలదాచుకోవాల్సిన పరిస్థితి. వీరికి పరిహారం అందించేందుకు ప్రభుత్వం, అధికారులు గీత గీసుకొని వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాలు పోతే కూడా ఒక కుటుంబానికే చెక్కు ఇచ్చి ఇంకో కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించకుండా అధికారులు ముఖం చాటేసుకొని వెళుతున్నారన్న ఆవేదన వెళ్లిబుచ్చుతున్నారు. బాధితులందరికి ప్రభుత్వం మొట్టమొదటిగా అందజేసిన రూ.5,800 నగదు మాత్రం వచ్చింది. ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులైన బియ్యం, బేడలు, నూనె కొన్ని గ్రామాలలో కొంత మందికి అందించకుండానే సహాయార్థాన్ని కూడా కొందరు కొట్టేస్తున్నారు.

ఇదిలా వుంటే మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న కుటంబాలకు రూ.95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు రూ.15 వేలు చెక్కులు మాత్రం హుటాహుటిన అందజేశారు. మరికొన్ని బాధిత కుటుంబాలకు ఈ సాయం అందాల్సిఉంది. ఈ చెక్కులు బ్యాంకులకు తీసుకెళితే వాటి డబ్బులు కూడా మూడు నెలల వరకు రావని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బాధల్లో ఉన్న వారికి ఆదుకునేందుకు అప్పు చెక్కులు ఇవ్వడమెందుకని, ఎప్పుడు మూడు నెలలకు డబ్బులిస్తే మాబాధలు తీరేదెన్నడని ఆవేదన కూడా వెలిబుచ్చుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement