Saturday, May 4, 2024

పెనుకొండలో ముగిసిన పోలింగ్..

అనంతపురం, (ప్రభన్యూస్‌) : పెనుకొండలో గెలుపుపై వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఎవరిధీమాలో వారు ఉన్నారు. తాము ఖచ్చితంగా గెలుపొందుతామని ఇరు పార్టీ నేతలు ప్రగాడ విశ్వసంతో వున్నారు. నగర పంచాయతీగా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా పెనుకొండలో సోమవారం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు విరామం లేకుండా వార్డుల్లో కలియతిరిగారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

13 స్థానాల్లో టీడీపీ విజయం సాదిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉండగా, వైసీపీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనావేస్తున్నారు. మొదట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు పరిస్థితి కనిపించినా తర్వాత రెండు రోజుల్లో తరమారు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వేసిన పాచికలు పారినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆఖరి రోజు వ్యూహాత్మకంగా మహిళలకు పదివేల చీరలు పంచడం, బైబిల్‌ ,ఖురాన్‌, భగధ్గీత పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని మార్చివేశారు. దీనికి తోడు ఆయా వార్డుల్లో వాలెంటీర్లు తీవ్రస్థాయిలో శ్రమించారు. బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు భద్రపరిచారు.

పోలింగ్‌ ముగియడంతో బ్యాలెట్‌ బాక్స్‌ లను సీల్‌ చేసి స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. ఈ నెల 17 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆరోజు ఓటర్లు అభ్యర్థుల భవితవ్యానికి తీర్పు ఇవ్వనున్నారు. ఐపిఎల్‌ ముగియడంతో ప్రస్తుతం జిల్లాలో పెనుకొండ ఎన్నికలు హాట్‌టాపిక్‌ గా మారిపోయాయి. దీంతో ఔత్సాహికులైన వారు బెట్టింగ్‌పై శ్రద్దపెట్టారు. ఇరుపార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ముఖ్యంగా మంత్రి శంకర్‌ నారాయణకు ఈ ఎన్నికలు కీలకం. అధిష్టానం వద్ద డిపాజిట్లు కోల్పోకుండా ఉండాలంటే గెలవడం తప్పనిసరిగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement