Wednesday, May 8, 2024

తెలుగు అకాడెమీ పేరు ఎందుకు మార్చారు?: పవన్ కల్యాణ్

తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు భాష వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్నే దూరం చేసేలా పేరు మార్చారని పవన్ విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలుగు అకాడెమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం ద్వారా ఏం సాధించారని నిలదీశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడెమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారు సైతం ఈ పుస్తకాలనే ఎంచుకొంటారని గుర్తు చేశారు. తెలుగు భాషకు సంబంధించిన పలు నిఘంటవులు, వృత్తి పదకోశాలు ఈ అకాడెమీ ద్వారా వచ్చాని తెలిపారు. అకాడెమీ ద్వారా భాషాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని విస్మరించి అకాడెమీ పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. అకాడెమీకి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోతే అక్కడి కార్యకలాపాలు కొంత కాలం నుంచి నిస్తేజంగా ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement