Thursday, May 16, 2024

టిటిడి ఆధ్వర్యంలో ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ సమ్మిట్.. 200 మంది ఆర్థో డాక్టర్ల లైవ్ సర్జరీ ప్రోగ్రాం

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : టిటిడి కి చెందిన బాలాజీ దివ్యాంగుల శస్త్ర చికిత్స, పరిశోధనా కేంద్రం (బర్డ్ ) ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు ” ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ సమ్మిట్ ” పేరుతో లైవ్ సర్జరీలు నిర్వహించే కార్యక్రమం జరగనున్నాయి. బర్డ్ ఆసుపత్రిలో గత నాలుగేళ్ళుగా రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్యం అందించడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునిక స్కానర్లు, ఎక్స్ రే మిషన్లు, సి టి స్కానర్లు లాంటి అనేక యంత్రాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఆసుపత్రికి వచ్చే రోగులకే కాకుండా బయటి ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న రోగులకు కూడా తక్కువ ఖర్చుకే సిటి, ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.

ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే లా వసతులు కల్పించి పేదలకు ఉచితంగా సర్జరీలు చేస్తూనే, సొమ్ము చెల్లించి సర్జరీ చేయించుకునే శక్తి ఉన్న వారికి తక్కువ ధరకే మోకీలు మార్పిడి, ఇతర ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్, ఫోన్ ఎస్ ఎం ఎస్ ద్వారా కూడా ఓపి సేవలు పొందే సదుపాయం ఏర్పాట్లున్నాయి. అటువంటి బర్డ్ ఆసుపత్రిలో జరుగుతున్న అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లను ఆసుపత్రి వైద్యులతో పాటు దేశంలోని ఆర్థో వైద్యులు చూసి అవగాహన పెంచుకోవడానికి టి టి డి ప్రత్యేకంగా ఆర్తో ప్లాస్టి సమ్మిట్ నిర్వహించ తలపెట్టింది . మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో దేశంలోని టాప్ 20 ఆర్థో వైద్య నిపుణులు లైవ్ లో సర్జరీలు చేస్తారు.

ఇప్పటిదాకా నమోదు చేసుకున్న సుమారు 200 మంది వైద్యులు బర్డ్ ఆసుపత్రి లోని ఆధునిక ఆపరేషన్ థియేటర్లో జరిగే సర్జరీలను ఫార్చూన్ గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో వీక్షిస్తారు. సర్జరీకి సంబంధించి తమకు తెలియని విషయాలను సర్జరీ చేస్తున్న ప్రముఖ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. బర్డ్ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైద్యుల నుండి వచ్చిన స్పందన దృష్ట్యా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించాలని బర్డ్ ట్రస్ట్ నిర్ణయించింది. డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్ పర్యవేక్షణలో సమ్మిట్ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి తెలిపారు. ఫార్చూన్ గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో జూన్ 30 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి సమ్మిట్ ను ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement