Wednesday, May 8, 2024

AP | 11 నుంచి నారా లోకేష్‌ ”శంఖారావం”.. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం యాత్ర రేపు (ఆదివారం) ప్రారంభం కానుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర స్ఫూర్తితో పార్టీ యువనేత లోకేష్‌ ఈనెల 11వతేదీ నుంచి ”శంఖారావం” పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్‌ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది.

11 రోజులపాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డుస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు, దోపీడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టడం, అదే సమయంలో వివిధవర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశాలపై లోకేష్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యువనేత లోకేష్‌ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్‌తో సమావేశమవుతారు. తొలుత నిర్ణయించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు శంఖారావం పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతున్నారు.

శంఖారావం మొదటి మూడు రోజుల షెడ్యూల్‌:

- Advertisement -

ఈ నెల 11న ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, 12న నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, 13న పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరగనుంది. యువనేత నారా లోకేష్‌ శంఖారావం యాత్ర కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఆదివారం ఇచ్ఛాపురం నుంచి శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement