Wednesday, May 19, 2021

ఏపీలో పగటి పూట కర్ఫ్యూ అమలు… 13న రైతు భరోసా నిధులు

కరోనా కట్టడి కోసం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని.. తర్వాత వాహనాలను పూర్తిగా నిలిచిపోతాయని వివరించారు.  కేబినెట్ లో చర్చించిన ఆమోదించిన నిర్ణయాలను వెల్లడించారు. ఉచిత పంటల బీమా, మత్స్యకార భరోసా, రైతులకు ఇన్ ​పుట్ సబ్సిడీ, బీసీల రిజర్వేషన్లు, ప్రైవేటీ వర్శిటీలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

రైతుల ఖాతాల్లో ఇన్‌ పుట్ సబ్సిడీ జమ చేశామని, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఇన్‌ పుట్ సబ్సిడీ సైతం అందిస్తున్నామని వివరించారు. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10 వేలు పరిహారం అందిస్తున్నామని చెప్పారు. నాటుపడవలపై వేటకు వెళ్లే అందరికీ మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 13న రైతుభరోసా తొలివిడత జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం రూ.4,050 కోట్లు విడుదల చేస్తామన్నారు. 54 లక్షల మందికి లబ్ధి పొందునున్నారని తెలిపారు.  మే 25న వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు జమ చేస్తామని, దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుందన్నారు.

ఏడో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ అమలు కోసం సీబీఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. 2024-25 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారని చెప్పారు. పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. 44,639 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు.

ఎయిడెడ్ పాఠశాలలను అప్పగిస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ వర్సిటీ చట్టంలో మార్పు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకంది. ప్రైవేట్‌ వర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీకి నిర్ణయించినట్ల వెల్లడించారు. ఏపీ డెయిరీ డెవలప్‌ మెంట్‌ కు చెందిన ఆస్తులు అమూల్‌ కు లీజుకు ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాదికి అన్ని గ్రామాలకు అమూల్ విస్తరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రకాశం పాల ఉత్పత్తి సంస్థ అప్పులు తీర్చడం పునరుద్దరణకు రూ.69 కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేసిందన్నారు. ఎ-కేటగిరీ ఆలయాల్లోని అర్చకుల గౌరవ వేతనం రూ.15 వేలు.. బి-కేటగిరీ ఆలయాల్లోని అర్చకుల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి 10 వేలు, మౌజమ్ లకు 3 వేల నుంచి 5 వేలు, పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. 176 మండలాల్లో పీహెచ్ సీలు ఏర్పాటు 511 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్ సీలు) ఉండేలా చర్యలు తీసుకోవాలని.. రెండు పీహెచీసీలకు కలిపి నలుగురు డాక్టర్లు ఉండాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు.

కరోనా కట్టడికి కేబినెట్‌లో విస్తృతంగా చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. 24 గంటల్లోనే కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశామన్నారు. ప్రతి మండల కేంద్రంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 558 ఆస్పత్రుల్లో కోవిడ్‌ వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 100కుపైగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కోవిడ్‌  బాధితుల కోసం 44, 599 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని వివరించారు. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Prabha News