Friday, April 26, 2024

హంద్రీనీవా ఇంజనీర్లతో మంత్రి జయరాం సమీక్ష

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని 28, 29 ప్యాకేజీ పరిధిలోగల పెండింగ్ పనులను సత్వరమే పరిష్కరించే నిమిత్తం.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హంద్రీనీవా ఇంజనీర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గంలో గల తన నివాసంలో ఏర్పాటుచేసిన సమీక్షకు హంద్రీనీవా చీఫ్ ఇంజనీర్ నాగరాజు, కర్నూల్ సర్కిల్ ఎస్ఇతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా ముందుగా హంద్రీ నీవా ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. 28, 29 ప్యాకేజీ పరిధిలోగల పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పరిధిలో 88 ఎకరాల భూ సేకరణ, ఇతర పనులపై చర్చ జరిగింది. ఆయా పనులను  పూర్తి చేసేందుకు రూ. 123 కోట్ల వరకు అవసరం అవుతుందని ఇంజనీర్లు మంత్రి గుమ్మనూరు దృష్టికి తెచ్చారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి.. నిధులు విడుదల  చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మొత్తంగా ఈ నెల 17వ తేదీన ఆలూరు నియోజకవర్గం పరిధిలో హంద్రీనీవా పనుల పెండింగ్ పై ఆంధ్రప్రభ మెయిన్ సంచికలో ప్రత్యేక కథనం ప్రచురించడం జరిగింది. దీంతో గత రెండున్నర ఏళ్లుగా ఏ నాడు హంద్రీ నీవా ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనీ మంత్రి .. ప్రస్తుతం ఆంధ్రప్రభ కథనంతో.. ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించడం గమనార్హం. వీటితో పాటు ఆస్పరి మండలం లో హంద్రీ-నీవా నుంచి చెరువులకు నీరు నింపే విషయంలో కూడా మంత్రి గుమ్మనూరు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement