Wednesday, May 15, 2024

Lucky Chance – లక్కప్ప సామాన్యుడే!… అయినా మడకశిర వైసిపి సమన్వయకర్తగా చాన్స్

శ్రీ సత్య సాయి బ్యూరో (ప్రభన్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపిలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అటు ప్రత్యర్థులు ఇటు స్వపక్షానికి ఊహించని విధంగా వైసీపీ సమన్వయకర్తల ఎంపిక సాగుతోంది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో మడకశిర వైసీపీ సమన్వయ కర్తగా ఈర లక్కప్ప అనే సాధారణ వ్యక్తి, మాజీ సర్పంచ్ ను నియమించడం జిల్లాలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్ కు ఆయనే సాటి అనేరీతిలో ఉందని చెప్పవచ్చు.

మొన్నటి వరకు ఒక సాధారణ కార్యకర్త. మాజీ సర్పంచ్. 1989 నుంచి 99 వరకు స్వచ్ఛంద సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు గుడిబండ సర్పంచుగా ప్రజలకు సేవలు అందించారు. 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గా పనిచేశారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2024 సాధారణ ఎన్నికలలో మడకశిర ఎస్సీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

లక్కప్ప స్వగ్రామం గుడిబండ మండలం పలారం. తండ్రి దివంగత లక్కప్ప సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అయితే.. గతంలో అతి సామాన్య వ్యక్తిగా ఉన్న నందిగం సురేష్ ఏకంగా బాపట్ల ఎంపీగా చేసిన ఘనత కూడా జగన్ కే దక్కింది. నిజాయితీ, పార్టీపై అంకిత భావం ప్రధానంగా వైఎస్ కుటుంబంపై చూపించిన ప్రేమాభిమానానికి గుర్తుగా నందిగం సురేష్ ను ఎంపీగా చేసి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపారు. అదే తరహాలో ఈర లక్కప్పను మడకశిర సమన్వయకర్తగా నియమించి, మరో సంచలనానికి తెర లేపారనే చర్చ సర్వత్రా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement