Saturday, October 5, 2024

ED | లిక్కర్‌ పాలసీ కేసు.. నిందితుల జాబితాలో ఆప్‌!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లి మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఈకేసులో ఇప్పటికే ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌ సహా ముగ్గురు కీలక నేతలను జైలుకు పంపిన ఈడీ, మరో అడుగు ముందుకేయనుంది. ఈ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చనున్నట్లు ఢిల్లి హైకోర్టుకు తెలియజేసింది. ఒక కేసులో రాజకీయ పార్టీని నిందితుడిగా చేర్చడం ఇదే తొలిసారి.

ఆప్‌ నేత, ఢిల్లి మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టుకు, ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసి అందులో పార్టీ పేరును నమోదు చేస్తామని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఈడీ చర్య ఆప్‌ను ఆందోళనకు గురిచేసేదిగా ఉంది.

గత ఏడాది అక్టోబరులో, ఆప్‌ని నిందితుడిగా చేయాలనే ప్రశ్నను సుప్రీం కోర్టు లేవనెత్తింది. రాజకీయ పార్టీ పేరు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది. కాగా, దర్యాప్తు సంస్థ రాజకీయ పార్టీని ఒక కంపెనీగా పరిగణిస్తోందని, ఆ లాజిక్‌ ప్రకారం అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఈవోగా ఉంటారని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఈడీ తాజా చర్యపై బీజేపీ స్పందించింది. 2022 గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లి మద్యం ముడుపులను ఆప్‌ ఉపయోగించిందని పేర్కొంది. భారత రాజకీయ చరిత్రలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అతిపెద్ద కుంభకోణం చేసింది. దాదాపు ఆపార్టీ ముఖ్య నేతలందరూ నిందితులుగా ఉన్నారు. మనీష్‌ సిసోడియాకు 15 నెలలుగా బెయిల్‌ లభించలేదు. మొత్తం పార్టీని నిందితుడిగా చేయడంలో ఆశ్చర్యం లేదు అని బీజేపీ అధికార ప్రతినిధి తుహన్‌ సిన్హా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement