Tuesday, July 23, 2024

AI | జాబ్‌ మార్కెట్‌పై ఏఐ సునామీ..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మూలంగా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని అనేక మంది ప్రముఖలు హెచ్చరిస్తునే ఉన్నారు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా ఏఐ విషయంలో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ జాబ్‌ మార్కెట్‌పై సునామీలా విరుచుపడుతోందని ఆమె హెచ్చరించారు.

రానున్న కాలంలో దీని వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు దీని వల్ల జరుగుతాయని చెప్పారు. జ్యూరిచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన క్రిస్టాలినా జార్జివా ఈ వ్యాఖ్యాలు చేశారు.

ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీన్ని అనేక విధాలుగా ఆవిష్కరించేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ జీపీటీ-4 మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గూగుల్‌ అండ్రాయిడ్‌ టెక్నాలజీకి ఏఐ ఫీచర్లను జోడించి మరింత మెరుగుపరిచేందుకు సిద్ధమవుతోంది.

కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావంతో అభివృద్ధి చెందిన దేశాఓ 60 శాతం ఉద్యోగాలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు దీనివల్ల ప్రభావితం అవుతాయన్నారు. తక్కువ సమయం ఉన్నందున ప్రజలు, వ్యాపారులు సన్నద్ధం కావాలని ఆమె సూచించారు.

ఏఐని సమర్ధంగా వినియోగించుకోవడం వల్ల కొన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగి సామర్ధ్యం మెరుగుకానుందని చెప్పారు. అదే సమయంలో సరిగా నిర్వహించకుంటే తప్పుడు సమాచార వ్యప్తితో పాటు, ఆదాయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్ధిక రంగానికి ఇది ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉందని జార్జివా అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement