Wednesday, May 29, 2024

EV | టీవీఎస్‌ ఐక్యూబ్‌లో కొత్త వేరియంట్స్‌..

ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌లో మరో రెండు కొత్త వేరియంట్లను తీసుకు వచ్చింది. దీంతో ఈ స్కూటర్‌ ఇప్పుడు మొత్తం ఐదు వేరియంట్లు, 11 రంగుల్లో లభిస్తోంది. టీవీఎస్‌ కొత్తగా తీసుకు వచ్చిన వేరియంట్స్‌లో బేస్‌ మోడల్‌ కూడా ఉంది. దీని ధర 95 వేల రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఇది 2.2 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

దీని గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లు. రెండు గంటల్లో ఈ స్కూటర్‌ బ్యాటరీ 80 శాతం ఛార్జ్‌ అవుతుంది. ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిప్‌ప్లే , నావిగేషన్‌, థెఫ్ట్‌ అలర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సీటు కింద 30 లీటర్ల స్టోరేజ్‌ ఉంటుంది. టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీలో 3.4 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో మరో కొత్త వేరియంట్‌ను టీవీఎస్‌ మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ స్కూటర్‌ ధర 1.56 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

బ్యాటరీని 2.50 గంట్లో 80 శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు. ఈ స్కూటర్‌లో కూడా 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. బ్లూటూత్‌, అలెక్సా వాయిస్‌ అసిస్ట్‌, డిజిటల్‌ డాక్యుమెంట్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూబ్‌ ఎస్‌టీలో 5.1 కిలోవాట్‌ బ్యాటరీ వేరియంట్‌ కూడా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర 1.85 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల స్పీడ్‌ అందుకుంటుంది. దీని బ్యాటరీని 4.18 గంటల్లో పూర్తి ఛార్జ్‌ చేయవచ్చు.

ఎస్‌టీ వేరియంట్లను జులై 15లోపుగా బుక్‌ చేసుకున్న వారికి లాయల్టి బోనస్‌ కింద 10,000 రూపాయిల రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకు వచ్చిన రెండు వేరియంట్స్‌తో కలిపి ఐక్యూబ్‌ ప్రస్తుతం 2.2 కిలోవాట్‌ అవర్‌, 3.4 కిలోవాట్‌ అవర్‌, ఐక్యూబ్‌ 3.4 కిలోవాట్‌ అవర్‌, ఐక్యూబ్‌ ఎస్‌టీ 3.4 కిలోవాట్‌ అవర్‌, ఐక్యూబ్‌ ఎస్‌టీ 5.1 కిలోవాట్‌ అవర్‌ ఇలా మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లు 11 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement