Saturday, April 27, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్… కుడి, ఎడమ కేంద్రాల్లో భారీగా విద్యుత్ ఉత్పత్తి…

కర్నూల్ బ్యూరో : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా నిండుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో జలాశయానికి
ఇన్ ఫ్లో 1,06,869 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండగా, జలాశయం నుంచి 1,99,344 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో జలాశయానికి చెందిన 5 స్పిల్ వే గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,26,471 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు 24000, హంద్రీనీవాకు 1350 చొప్పున మొత్తం 2,17,790 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు వెళ్తుంది. ముఖ్యంగా శ్రీశైల జలాశయం నిండుకుండలా నిండుకోవడంతో ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 30, 176 క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని ఏడు జనరేటర్ల ద్వారా 16.450 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక ఎడమ విద్యుత్ కేంద్రంలో 35601 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 17.433 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి గత నెల రోజులుగా వరద నీరు ప్రవహిస్తున్నడంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో నిర్ణీత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.8450 టీఎంసీల నీటి నిల్వలు ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement