Tuesday, May 14, 2024

మే 31న సిద్దేశ్వర అలుగు ప్రజా జాగరణ దీక్ష.. బొజ్జా దశరథరామిరెడ్డి

చట్టబద్ద నీటి హక్కులకై రాయలసీమలో ఉద్యమ స్పూర్తిని రగిల్చిన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుందామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే, సిద్దేశ్వరం అలుగు ఉద్యమ స్ఫూర్తితో రాయలసీమ సాగునీటి సాధన సమితి తిరిగి అనుమతులు సాధించిన విషయాన్ని దశరథరామిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలాగా రూల్ కర్వ్ ను సిద్దేశ్వరం ప్రజా అలుగు శంకుస్థాపన స్ఫూర్తితో సాధించామని ఆయన పేర్కొన్నారు.

ఉద్యమాలతో సాధించిన హక్కుల అమలు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న పాలకుల, వాటి అమలుకు పట్టుపట్టని ప్రతిపక్ష రాజకీయ పార్టీల వైఖరిని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడుతూ, మన హక్కుల అమలుకు సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన స్పూర్తితో రాయలసీమ సమాజం సిద్దమవుదామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మే 31న సాయంత్రం 7గంటల నుండి జూన్ 1 ఉదయం 10 గంటల వరకు నిర్వహించే సిద్దేశ్వరం అలుగు ప్రజా జాగరణ దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజానీకాన్ని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, సౌదాగర్ ఖాసిం మియా, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement