Friday, May 17, 2024

AP | కలెక్టర్ జోక్యంతో బాల్య వివాహనికి బ్రేక్.. తల్లి తండ్రులకు అధికారుల కౌన్సిలింగ్

నంద్యాల, ప్రభన్యూస్ ప్రతినిధి : తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని ఓ బాలిక ఆవేదనను సోషియల్ మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జోక్యంతో బాల్య వివాహానికి బ్రేక్ పడిన అరుదైన సంఘటన ఈరోజు నంద్యాల జిల్లాలో జరిగింది. పలువురు అధికారులు ఆ బాలిక తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు ఆ బాలికకు కస్తూర్బా పాఠశాలలో సీటు కేటాయించారు. ఈ ఉదంతం పూర్వపరాలు ఇలా ఉన్నాయి..

నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో మైనార్టీ వర్గానికి చెందిన మైనర్ బాలిక కు చేస్తున్న పెళ్లిని ఐసిపిఎస్, ఐసిడిఎస్, స్థానిక మండల అధికారులు, పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. చదువుకోవాలని ఉన్నా పెద్దలు
తనకు ఇష్టం లేకుండా వివాహం జరిపిస్తున్నారని, ఎలాగైనా పెళ్లిని ఆపి తనకు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఆ బాలిక తన తోటి స్నేహితులతో చెప్పుకుంది.

ఆ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్ డా.మన‌జీర్ జిలాని సామూన్ స్పందించారు. ఆయన జిల్లా ఎస్ పి కె.రఘువీర్ రెడ్డి తో కలిసి జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు గ్రామానికి వెళ్లి ఆ బాల్య వివాహన్ని నిలిపివేశారు.

- Advertisement -

వివాహాన్ని అడ్డుకొని, బాలిక తల్లితో పాటు పెళ్లి కుమారునికి చెందిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వారికి వివరించి మైనార్టీ తీరేవరకు బాలికకు వివాహాన్ని చేయబోమంటూ ఇరువురికి చెందిన తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాన్నితీసుకున్నారు. అంతేకాకుండా బాల్యవిహాల చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే బాలిక చదువుకోవడానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కస్తూరిబా మైనార్టీ పాఠశాలలో చదువుకోవడానికి వసతి కల్పించారు.

ఈ కార్యక్రమంలో డిసిపిఓ శారద, బనగానపల్లె ఐసిడిఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరి, మండల రెవెన్యూ అధికారి, డిసిపియు సిబ్బంది శ్వేత, నరసింహ, చైల్డ్ హెల్ప్ లైన్ డిస్టిక్ కో ఆర్డినేటర్ సుంకన్న, బిబిఏ యాక్సిస్ టూ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాం డిస్టిక్ కో ఆర్డినేటర్ వెంకట తిమ్మారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇష్టం లేని పెళ్లి ఆగిపోవడం తో పాటు చదువుకునే అవకాశం కల్పించిన కలెక్టర్ కు ఇతర అధికారులకు ఆ బాలిక కృతజ్ఞతలు తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement