Monday, April 29, 2024

Big story | ముంపు ఉద్యోగులకు న్యాయం జరిగేనా.? తమను ఆదుకోవాలని కోరుతున్న బాధితులు

శ్రీశైలంనీటి ముంపు బాధితులను ఆదుకునేవారే కరువయ్యారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇస్తామంటారు. తరువాత పట్టించుకోవడం లేదు. అనారోగ్యంతో, వయసుమీద పడి ఇప్పటికే చాలా మంది చనిపోగా, దాదాపు వెయ్యి మంది 2012 సంవత్సరం నుంచి అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిన నీటిపారుదలశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులు చనిపోతే భార్యకు తప్ప పిల్లలకు ఉద్యోగ అవాకాశం కల్పించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు జీవో నెం.98 కింద అందరికీ రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నర ఏళ్లు గడిచింది. ఇంతవరకు వీటి ఊసే లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరం కంటే ముందు నుంచి ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్‌ పద్దతిన విధులు నిర్వహిస్తున్నావారిని రెగ్యులర్‌ చేసేందుకు కేబినేట్‌ కూడా ఆమోదం తెలిపింది. వీరితో పాటు తమకు అవకాశం కల్పించి రెగ్యులర్‌ చేయాలని శ్రీశైలం ముంపు ఉద్యోగులు కోరుతునారు.

కర్నూలు ప్రతినిధి, ప్రభన్యూస్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇంతవరకు జీవో నెంబర్‌. 98 కింద ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు.. 43 సంవత్సరాలుగా ఉద్యోగులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.ఇప్పటికే కొంతమందికి ఉద్యోగ వయసు అయిపోయింది. మరి కొంతమంది చనిపోయారు. అయితే 2011 సంవత్సరంలో ప్రభుత్వం జీవో నెంబర్‌ 735 తీసుకొచ్చి శ్రీశైలం నీటి పంపు నిరుద్యోగులకు ఔట్సోర్సింగ్‌ కింద లష్కర్లుగా ఉద్యోగాలు కల్పించింది. అంతేకాక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న గవర్నర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖలో ఏర్పడ్డ ఖాళీలలో 50 శాతం ఉద్యోగాలను ఈ అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్లకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే ఇందులో కూడా ఒక మతలబు ఉంది.

- Advertisement -

నీటి పారుదల శాఖలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ సంబంధిత ఇంజనీర్లు ఖాళీలు చూపించడం లేదు.. దీంతో ఔట్‌ సోర్సింగ్‌ లస్కర్లకు రెగ్యులర్‌ ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారింది.. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులు చనిపోవడం కూడా జరిగింది.. అందులోనూ 58 ఏళ్ల వయసు దాటిన వారిని కంటిన్యూ చేయడం లేదు.. గత ప్రభుత్వాలు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచిన వీటిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తింపజేయడం లేదు. 2012సంవత్సరం నుంచి 952 మంది పైగా నీటి గుంపు నిరుద్యోగులు ఔట్‌సోర్సింగ్‌ లస్కర్‌గా పనిచేస్తూ ఉన్నారు.

వీరిలో కొందరు రిటైర్మెంట్‌ కూడా అవుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఔట్‌సోర్సింగ్‌ లస్కర్లు చనిపోతే వల్ల వారి కుటు-ంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించడం లేదు. ఈ ఉద్యోగం చనిపోతే వారి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు కానీ వారి పిల్లలకు కల్పించడం లేదు. ప్రస్తుతం ఈ ఉద్యోగులకు నెలకు రూ. 20 వేల వేతనం చెల్లిస్తున్నారు. ట్రెజరీ ద్వారా వీరికి జీతాలు చెల్లిస్తున్నా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం లేదు. ఎస్‌ఆర్‌, హెచ్‌ఆర్‌ఏ, పీఎఫ్‌ లాంటి సౌకర్యాలు వీళ్లకు వర్తించడం లేదు.

ఈ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం వల్ల ప్రభుత్వం పైన పెద్ద భారం కూడా పడదని ఉద్యోగులు అంటున్నారు.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఔట్‌సోర్సింగ్‌ కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చింది.ఇటీవల కాలంలో ప్రభుత్వం కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేందుకు కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో నీటి పంపు ఉద్యోగులు తమను కూడా రెగ్యులర్‌ చేయాలని కోరుతున్నారు.. ఇప్పటికే 43 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని 952 మంది పైగా ఉన్న తమను రెగ్యులర్‌ చేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ముంపుకు గురైంది ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో జల విద్యుత్‌ సాగునీరు తాగునీరు అవసర నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల దాదాపు 400 గ్రామాలు , దాదాపు లక్ష ఎకరాల భూమి నీటి ముంపుకు గురయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఇండ్లు భూములు తీసుకున్న ప్రభుత్వం అప్పట్లో ఎకరాకు రూ.1500 నుంచి రూ. 2000 వరకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించడంలోపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. నీటి ముంపు గ్రామాల ప్రజలు చేసిన త్యాగంతో ఇతర ప్రాంతాల్లో అవసరాలు తీరినా ఈ ముంపు బాధితులను మాత్రం ఆదుకోవడంలో ప్రభుత్వం గత 45 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. నిరుద్యోగులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.. ఈ పోరాటంలో ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. జీవో నెంబర్‌ 98 ప్రకారం సర్వం కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది..

వీటిని అమలు చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. 37 సంవత్సరాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నీటి పారుదల శాఖలో ఏర్పడిన ఖాళీలలో 50 శాతం రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇవ్వడంతో 200 మందికి శాశ్వత ఉద్యోగాలు దక్కాయి. ఇంకా దాదాపు 952 మంది పైగా ఔట్సోర్సింగ్‌ లస్కర్లగా పనిచేస్తున్నారు.. హెచ్‌ఎన్‌ఎస్‌, ఎల్‌ఎల్‌సి, ఎస్సార్‌బీసీల కింద ముంపు బాధితులు ఔట్సోర్సింగ్‌ లస్కర్లుగా పనిచేస్తున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు పనిచేస్తున్న తెలంగాణ వారిని రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకొని రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చేసింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం వీళ్లను ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులుగానే ఉంచింది.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నుంచి నారా చంద్రబాబు నాయుడు, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి లతోపాటు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా శ్రీశైలం నీటి పంపు నిరుద్యోగులకు జీవో నెం.98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుంలోకి వచ్చి నాలుగన్నర ఏళ్లు గడిచినా కానీ ఇంతవరకు వీరిని రెగ్యులర్‌ చేయలేదు.. అయితే గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 2014 కంటే ముందు ప్రభుత్వ శాఖలో కాంటాక్ట్‌ పద్ధతిన విధుల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించింది. వీటిలో తమకు కూడా అవకాశం కల్పించి 43ఏళ్లుగా పోరాటం చేస్తున్న మమ్ములను రెగ్యులర్‌ చేసి ఆదుకోవాలని ఔట్సోర్సింగ్‌ లస్కర్లు కోరుతున్నారు..

ముంపు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

నీటి పారుదలశాఖలో అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్‌లుగా పని చేస్తున్న శ్రీశైలం నీటి ముంపు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయాలని శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు నిర్వాసితుల అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్‌ల సంఘం అధ్యక్షులు నాగన్న డిమాండ్‌ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో పొలాలు, ఇళ్లు పోగొట్టుకొని రోడ్డున పడ్డామన్నారు.

జీవో నెం. 98 ప్రకారం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు 50 ఏళ్లుగా కాలయాపన చేస్తూ జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. తాము చేసిన పోరాటాలతో 2012 సంవత్సరంలో నీటిపారుదల శాఖలో తాత్కాలికంగా దాదాపు వెయ్యి మందికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇదేశాఖలో ఖాళీలు ఏర్పడ్డ పోస్టుల్లో తమకు 50శాతం పోస్టులు ఇస్తున్నారన్నారు. వీటివల్ల కేవలం కొంత మందికి మాత్రమే అవకాశం దక్కుతుందన్నారు.

ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారిలో కొంత మంది వయసు మీదపడ్డవారి సర్వీసు పూర్తికాగా, మరికొందరు చనిపోయారన్నారు. మిగిలిన వారికైనా రెగ్యూలర్‌ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం పొలాలు, ఇళ్లతోపాలు సర్వం త్యాగం చేసినప్పటికి ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అంతేకాక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చనిపోతే భార్యకు మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారని, వారి పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.

ఇటీవల ప్రభుత్వం 2014 సంవత్సరంలోపు ప్రభుత్వ శాఖల్లో చేరిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్‌ చేస్తున్నట్లు ప్రకటించిందని, వీటిలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికీ తమకు -టె-జరీ ద్వారానే జీతాలు చెల్లిస్తున్నారని, తమను రెగ్యూలర్‌ చేయడం వల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకొని అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న శ్రీశైలం నీటిముంపు ఉద్యోగులను రెగ్యులర్‌చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement