Saturday, April 27, 2024

క‌ర్నూల్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌

క‌ర్నూలు జిల్లాలో దొంగ‌లు రోజురోజుకి విజృంభించి ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను నిమిషాల వ్యవధిలో కొల్లగొట్టడమే కాకుండా మహిళల మెడలో గొలుసులు, ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడులు చేసి దోచేస్తున్నారు. బంగారం మొదలుకొని గొర్రెల వరకు తస్కరిస్తున్నారు. గొర్రెల కాపరులు సైతం రాత్రివేళల్లో భయంతో కాపలా కాసే పరిస్థితి నెలకొంది. దొంగతనాల కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కొందరు పోలీసులు విఫలమవుతున్నారు. సరైన ఆధారాలు సేకరించలేకపోవడం, దీనికితోడు పలు ప్రాంతాల్లో సిబ్బందికొరతతో సమస్యలు ఎదురవుతున్నాయి.

2019లో లాభం కోసం హత్యలు ఒకటి జరగరగా, 2020లో ఒక్కటీ జరగలేదు. ఈ ఏడాదిలో ఒక్కటి. దోపిడీ కేసుకు సంబంధించి 2019లో 8, 2020లో ఒకటి, ఈ ఏడాదిలో నాలుగు కేసులు, రాబరీకి సంబంధించి 2019లో 15, 2020లో ఒకటి, ఈ ఏడాదిలో 11 కేసులు, దొంగతనాలకు సంబంధించి 2019లో 724, 2020లో 541, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 375 వరకు నమోదయ్యాయి.
చోరీకి గురైన సొత్తు రికవరీ వివరాలు :
జిల్లాలో 2019 నుండి చోరీకి గురైన సొత్తు, రికవరీ వివరాలుపరిశీలిస్తే 2019 సంవత్సరంలో అపహరణకు రూ.5.25కోట్లు గురికాగా, వాటిలో రూ.2.30కోట్లు మాత్రమే రాబట్టారు. 2020లో రూ.4.37కోట్లు అపహరణకు గురికాగా, రూ.1.47కోట్లు మాత్రమే రాబట్టారు. ఈ ఏడాదిలో దాదాపు రూ.7కోట్లు అపహరణకు గురికాగా అందులో దాదాపు రూ.3కోట్లకు పైగా మాత్రమే రాబట్టారు.
నగరంలో ఒకేరోజు రెండు చోరీలు :
కర్నూలు నగరంలో గత వారంలో ఒకేరోజు రెండు చోరీలు జరిగాయి. మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అరుంధతి నగర్‌లో కాలనీవాసి నాగరాజు ఇంటిలో ఒక టివి, రెండు తులాల బంగారు ఆభరణాలు, ఒక సిలిండర్‌ అపహరణకు గురైంది. అలాగే కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత వారంలోనే బాలాజీ నగర్‌ బంజారా కాలనీలో షేక్‌ అబ్దుల్‌హుసేన్‌ ఇంటిలో చోరీ జరిగింది. బీరువాలోని 8 తులాల బంగారు ఆభరణాలు, ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగలు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారాగారాలు వేధికగా :
కారాగారాల్లో వేధికలుగా కొత్తకొత్త ముఠాలు తయారవుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పసుపులేటి సాయికుమార్‌ పట్టుబడి జైలుకు వెళ్లారు. అక్కడ మోసం కేసుల్లో నిందితుడైన అనంతపురం జిల్లాకు చెందిన ఓబులేసు హత్యకేసులో నిందితుడు రాంగోపాల్‌తో స్నేహం ఏర్పడింది. ముగ్గురు కలిసి కర్నూలులో పలు చోరీలకు పాల్పడి దొరికిపోయారు. ఎమ్మిగనూరుకు చెందిన మాచర్ల శ్రీకాంత్‌ చిల్లర దొంగతనాలు చేసే బోయ వీరేష్‌తో జైలులో పరిచయమై స్నేహితులయ్యారు. ఇద్దరు కలిసి జిల్లా పరిధిలో భారీ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కారాగారాల్లో స్నేహితులుగా మారి కొత్త ముఠాలుగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు. సత్ప్రవర్తనతో బయటకు రావాల్సిన వారు ముఠాలుగా ఏర్పడుతుండటంతో పోలీసులు వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement