Thursday, May 2, 2024

క్రికెట్ బెట్టింగ్ కు పోలీసు‌లు చెక్ – 12 మంది అరెస్ట్..

రూ. 5.24 లక్షల నగదు స్వాధీనం
11 సెల్ ఫోన్లు, ఒక యాపిల్ టాబ్, ఒక కలర్ టీవీ సీజ్
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు

మచిలీపట్నం,- అమాయక ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళకు పోలీసులు చెక్ పెట్టారు. ఐపీఎల్, టి20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని, అమాయక ప్రజలను ముఖ్యంగా యువతను టార్గెట్ గా చేసుకొని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ లను కూకటివేళ్లతో పెకలించటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్ పర్యవేక్షణలో ప్రారంభం నాటి నుండి నేటి వరకు క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బెట్టింగ్ రాయుళ్ల భారతం పడుతున్నారు. బెట్టింగ్ నిర్వహించే నిర్వాహకులను, ఫంటర్లు అదుపులోనికి తీసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బెట్టింగ్ అడ్డుకట్ట వేస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి ఇనకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడుగుపేట నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇనకుదురు పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో గల కాన్ఫెరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రవకుల్ జిందల్ తో కలిసి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ అమాయకుల అలవాట్లను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన, నిర్వహించిన ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరం మేరకు సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ఊరికే వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉన్నాయనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అనవసర ఆర్భాటాలకు పోయి తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేయవద్దని ఉద్బోధించారు.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే: –
మచిలీపట్నం గొడుగుపేటలోని బోడి శ్రీ వెంకట లక్ష్మీ గణేషన్ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంపై బుధవారం రాత్రి 9.30 గంటలకు ఇనగుదురు ఎస్ ఐ రాంబాబు, పోలీసు , స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇంట్లో ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు ఇతర సహచరులతో కలిసి టీవీ లో కోల్కతా నైట్ రైడర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుండి రూ.5,24,783/- నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక టాబ్ కలర్ టివి, క్యాలిక్యులేటర్ -2, పుస్తకాలు – 6, లను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దాడిలో మద్దంశెట్టి సుబ్రహ్మణ్యం ( అజ్హర్) (42),కేతవరపు భాను ప్రకాష్ (32), పేరూరి శ్యాంసుందర్ బాబురావు (46), కౌతవరపు నవీన్ (25),.పొట్లూరి నరేంద్ర కుమార్ (64), బోడి శ్రీ వెంకట లక్ష్మీ గణేషన్ (42) లతోపాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, డి ఎస్ పి రమేష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్, ఇనకుదురు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ పేట ఇన్స్పెక్టర్ భీమరాజు, చిలకలపూడి ఇన్స్పెక్టర్ అంకబాబు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై రమణ, ఇనకుదురు ఎస్ ఐ రాంబాబు, పెడన ఎస్సై మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement