Thursday, May 9, 2024

క‌ర్నాట‌కాంధ్ర – జ‌గ‌న్, బాబు మ‌ద్ద‌తు కోసం బిజెపి చూపులు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కర్నాటకలో జరుగుతున్న అసెంబ్లిd ఎన్నికల్లో ఏపీలోని రెండు ప్రధాన పార్టీల మద్దతు కీలకంగా మారింది. దీంతో ఆ రాష్ట్రంలో పోటీ చేస్తున్న రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి చెందిన రెండు ప్రాంతీయ పార్టీల నిర్ణయం పై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఆ రాష్ట్రంలోని సుమారు 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా కర్నాటకలో ప్రచారం కూడా నిర్వ హించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయితే చంద్రబాబు, జగన్‌లు ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ప్రతి ఎన్నికల్లో జగన్‌ పాత మిత్రుడు బీజేపీలో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి సొంత పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. దీంతో కర్నాటక ఎన్నికల్లో జగన్‌ నిర్ణయం మరోసారి కీలకంగా మారబోతుంది.

రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అంశంపై జోరుగా చర్చ నడుస్తుంది. మరి సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో కర్నాటకలో ఉన్న తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలోనూ అదే పార్టీ చక్రం తిప్పుతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేఫథ్యంలో వైసీపీ , తెలుగుదేశం .. బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో పై రెండు పార్టీలు బీజేపీకే మద్దతిస్తా యా .. లేక చంద్రబాబు 2019 ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టే ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మద్దతిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

జగన్‌, చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మిత్రపక్షంగా కలిసి పోటీ చేయనప్పటికీ .. కేంద్రంలో మాత్రం అవసరాన్ని బట్టి బీజేపీకి మద్దతు ఇస్తుంది. పార్లమెంట్‌లోనూ, రాజ్యసభలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు అనేక సందర్భాల్లో మద్దతు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో అవసరమైతే వైసీపీ బీజేపీకి పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు విషయంలోనే బీజేపీకి స్పష్టత రావడం లేదు. 2014 ఎన్నికల్లో కర్నాటక రాష్ట్రంలో చంద్రబాబు పర్యటించి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు కుదరలేదు. దీంతో ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేసింది. అదే సందర్భంలో కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో కర్నాటకలో చోటు చేసుకున్న రాజకీయ సంఘటనల నేపథ్యంలో అధికారాన్ని తిరిగి బీజేపీ సొంతం చేసుకుంది. వచ్చే నెలలో జరగనున అసెంబ్లి ఎన్నికల్లో కూడా తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకు జగన్‌తో పాటు చంద్రబాబు నిర్ణయం కూడా కీలకంగా మారింది.

- Advertisement -

ప్రస్తుత ఎన్నికల బరిలో .. గాలి పార్టీ
జగన్‌ పాత మిత్రుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో సొంత పార్టీని బరిలోకి దించబోతున్నారు. గతంలో బీజేపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన ఓబులాపురం మైనింగ్‌ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఆ తరువాత ఆయన బీజేపీకి దూరమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో సొంత పార్టీని స్థాపించి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి జగన్‌ మద్దతు కోరతారా .. ఒకవేళ ఆ దిశగా ఆయన కోరితే జగన్‌ అనుకూలంగా వ్యవహరిస్తారా .. అదే జరిగితే కేంద్రంలో అనుకూలంగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జగన్‌ మద్దతు ఇస్తారా అన్న ఆసక్తికరమైన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి కర్నాటక ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన రెండు ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారబోతుందన్న ఆసక్తికరమైన చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement