Monday, May 20, 2024

జూన్ లోనే అసెంబ్లీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నున్న జ‌గ‌న్ …

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముందస్తు తప్పనిసరి అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను బదిలీ చేశారు. వీరందరినీ వైఎస్‌ జగన్‌ ఎన్నికల టీమ్‌గానే చూస్తున్నారు. మరికొద్ద రోజుల్లో మరో దఫా అధికారుల బదిలీలు ఉంటాయని అంటున్నారు. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే వీరిని ఇప్పుడు బదిలీలు చేశారనే ప్రచారం వినిపిస్తోంది. నవరత్నాలు పథకాలు అమలు జరగుతున్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలని సిఎం జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అదే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళితే సంక్షేమ పథకాల అమలుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. రానున్న ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు సహకరిస్తుందో లేదో అనే అనుమానం వైఎస్‌ జగన్‌లో ఉంది. ఈ కారణంగా ముం దస్తుగా ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరగుతోంది. అందులో భాగంగా జూన్‌ మాసంలోనే కొంతమంది అభ్యర్ధులను ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

80 నుండి 90 మంది అభ్యర్ధులను జూన్‌ మాసంలోనే ప్రకటిస్తారని అంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి ప్రారంభమౌతుందని, ప్రతిపక్షాలకు బలం పుంజుకునేందుకు సమయం దొరకదని సిఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన సీట్లలో తప్పించాల్సిన వారిని తప్పించి కొత్త వారిని తర్వాత ప్రకటించే అవకాశముంది. మొత్తంగా 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందనేది సిఎం జగన్‌కు నివేదికలు ఉన్నాయి. ఇంత మందిని కాకున్నా కనీసం 40 మంది మార్చుతారనే ప్రచారమైతే జరుగుతోంది. దీంతోపాటు సెప్టెంబర్‌ నుండి సిఎం జగన్‌ పల్లె నిద్రకు బయల్దేరి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో సెప్టెంబర్‌ నుండే సిఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఉంటుందని, ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించినట్లు అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత ఫోకస్‌తో గడప..గడప కు…
ఇప్పటికే కొనసాగుతున్న గడప గడపకు కార్యక్రమాన్ని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మరింత ఫోకస్‌తో అమలుచేయనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలతో మరింత మమేకం అవ్వాలని కొద్ది రోజుల క్రితం జరిగిన మీటింగ్‌లో సిఎం జగన్‌ సూచించారు. జిల్లాలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రతిపక్షాలకు అస్సలు అవకాశం ఇవ్వొద్దని, వెనువెంటనే ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలను వెల్లడించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంగా కొనసాగుతోంది. దీంతోపాటు ఈనెల 13వ తేదీ నుండి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంబించబోతున్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న ఫోన్‌ నెంబర్‌కు చేసిన సమస్యను రికార్డు చేస్తే ఆ సమస్యపై సిఎం పరిష్కారం ఇస్తారు. గత ప్రభుత్వ హాయంలోనూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పడు సిఎం జగన్‌ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పూర్తి స్తాయిలో సిద్దమౌతోందనేది స్పష్టమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement