Sunday, May 19, 2024

Delhi | ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు.. ఎన్నికల విధుల్లో గ్రామ వాలంటీర్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అనేక రకాలుగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కే. అచ్చెన్నాయుడు నేతృత్వంలో సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, బోండా ఉమ, నిమ్మల రామానాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు మంగళవారం సాయంత్రం గం. 6.00కు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు.

అనంతరం అచ్చెన్నాయుడు అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా, ఎన్నికల విధుల విషయంలో దేశమంతటా ఒక విధానం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రత్యేక విధానం అమలవుతోందని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటారని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పార్టీ జెండాలు పట్టుకుని మరీ పనిచేస్తున్న గ్రామ సచివాలయ సిబ్బందితో ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు పనులు చేయిస్తున్నారని అన్నారు.

- Advertisement -

తెలుగుదేశం సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఉన్న ఓట్లను తొలగించడంతో పాటు దొంగ ఓట్ల నమోదు భారీగా జరుగుతోందని ఆరోపించారు. ఒకే ఇంటి నెంబర్‌తో 10 మందికి పైగా ఓటర్లు ఉంటున్నారని, అందులో సగం మంది దొంగ ఓటర్లే అని అన్నారు. చనిపోయిన వ్యక్తుల డెత్ సర్టిఫికెట్లు చూపించినా సరే ఆ ఓట్లు తొలగించలేదని, అలాగే ఒకే వ్యక్తి పేరిట ఉన్న రెండు ఓట్లను చూపించినా సరే తొలగించడం లేదని అన్నారు.

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉన్నతాధికారులను జిల్లా అధికారులుగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పనులు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటిస్తుందని చెప్పారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోతే న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement