Sunday, May 19, 2024

రేషన్ బియ్యం ఇప్పించండి సారూ….

తెనాలి : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టిన కిందిస్థాయి అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా అవి సక్రమంగా వారికి అందడం లేదు. వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి రేషన్ దుకాణం వద్ద సరుకుల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంత వాలంటీర్ వి ఆర్ వో లు రేషన్ సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అయినప్పటికీ కొంత మంది వాలంటీర్లు వీఆర్వోలు ఇష్టానుసారం ప్రవర్తించడంతో రేషన్ సక్రమంగా పంపిణీ జరగడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక గంగానమ్మ పేట భవనం వారి వీధికి చెందిన రోసమ్మ అనే వృద్ధురాలు తనకు ఏడాది నుండి రేషన్ బియ్యం లేదని కనబడిన వారి వద్ద కన్నీరు మున్నీరవుతూ చెపుతున్నప్పటికీ ఇంతవరకు అందించడం లేదు. ఎవరిని కలవాలో తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక లేక చేసేదేమీలేక ఏడాది నుండి రేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తనకు తెచ్చిపెట్టే వారు లేక వృద్ధాప్యంలో మంచానికే పరిమితమైన రోశమ్మకు సాయం చేసేవారు లేక చేసేదేమీలేక మిన్నకుండి పోయింది. ఎట్టకేలకు మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మణరావు కలిసి తన గోడు విన్నవించుకుంది. వేలిముద్రలు సరిగా పడని కారణంగా తన రేషన్ ను ఈ ఏడాది పాటు నిలిపివేశారని ఆయన దృష్టికి తీసుకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన వార్డు సచివాలయంలో వి ఆర్ ఓ, వాలంటీర్ ఉంటారని అక్కడ కలవాలని సూచించారు. వి ఆర్ ఓ, వాలంటీర్లు బియ్యం కంపెనీ వాహనం వద్ద తప్పకుండా ఉండాలి అన్న నిబంధన ఉన్నప్పటికీ ఏ వాహనం వద్ద వారు కనిపించడం లేదు. ప్రభుత్వం దృష్టికి వచ్చిన అలాంటి బాధితులు ఎంతోమంది తమకు అందక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న వి ఆర్ ఓ, వాలంటీర్ల పై చర్యలు తీసుకొని రేషన్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement