Friday, May 10, 2024

సింగరేణిలో కొనసాగుతున్న సహాయక చర్యలు, మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు

పెద్దపల్లి, ప్రభన్యూస్‌: సింగరేణి గనిలో కార్మికులను రక్షించేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్‌ వాల్‌ గనిలో పైకప్పు కూలి ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు గనిలో చిక్కుకుపోయిన విషయం విదితమే. మంగళవారం తెల్లవారు జామున నరేశ్‌ను రక్షించిన రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బంది 24 గంటలు శ్రమించిన అనంతరం బదిలీ వర్కర్‌ రవీందర్‌ను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన నరేశ్‌, రవీందర్‌లను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. అయితే 30 గంటలు గడిచినా ఇంకా ముగ్గురు గనిలో చిక్కుకుపోవడం, వారి ఆచూకీ తెలియకపోవడంతో కార్మికులతోపాటు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషనరీతో బొగ్గు శకలాలను తొలగిస్తే అందులో చిక్కుకున్న కార్మికులకు గాయాలవుతాయని మాన్యువల్‌గా శకలాలను తొలగిస్తున్నారు.

సేఫ్టీ అధికారి జయరాజ్‌, అండర్‌ మేనేజర్‌ చైతన్య తేజ్‌తోపాటు తోట శ్రీకాంత్‌ల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలను సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌తోపాటు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌లు పర్యవేక్షిస్తున్నారు. గనిలో చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టడంతోపాటు వైద్య సిబ్బందిని సైతం గనిలోకి పంపించారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప గనిలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement