Thursday, May 16, 2024

ముగిసిన అమరావతి ప్రజా దీక్ష .. నిమ్మ‌రసం అందించిన ధూళిపాళ్ల‌

ముగిసిన అమరావతి ప్రజా దీక్ష .. నిమ్మ‌రసం అందించిన ధూళిపాళ్ల‌

తుళ్లూరు:

అమరావతినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని వెలగపూడిలో కొన‌సాగుతున్న రైతుల దీక్ష 800వ రోజు సందర్భంగా తలపెట్టిన 24గంటల సామూహిక దీక్ష శుక్రవారం ముగిసింది. తెదేపా నేత దూళిపాళ్ల నరేంద్ర బాబు రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని నమ్మి రైతులు 34 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చారని , వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా రాజధానిపై కక్ష సాధిస్తూ నిర్వీర్యం చేస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాజధాని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మూడు ముక్కలాట మాని అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారని విమ‌ర్శించారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు, ప్రజలు మహా ఉద్యమాన్ని నడుపుతున్నారన్నారు. అధికారం ఉందని ముళ్ల కంచెలు వేసినా, వాటిని దాటి 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిలో ఏముంది? శ్మశానం అని వైసీపీ నేతలు హేళన చేశారని, ఇప్పుడు ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా…? అని నరేంద్ర ప్రశ్నించారు. జై అమరావతి నినాదం దీక్షలో హోరెత్తింది. అమరావతే తమ అంతిమ లక్ష్యం అంటూ అక్కడి రైతులు, మహిళలు, కూలీలు ఉద్యమ పిడికిలి బిగించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. అడ్డంకులు కల్పించినా.. కేసులు పెట్టినా అడుగులు వెనకకు పడవంటూ తెగేసి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement