Friday, May 3, 2024

శిథిలాల క్రింద విద్యాభ్యాసం : భయంతో విద్యార్థులు

గంపలగూడెం : విద్యార్థులు భయం భయంగా చదువు కొనసాగించాల్సిన పరిస్థితి మండలంలోని ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొంది. తరగతి గదులు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో అని ఆలోచిస్తున్నారు. పాఠశాలలోని నాలుగు తరగతి గదులు, స్టాఫ్ రూమ్ వద్ద స్లాబ్‌ పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. దీంతో శ్లాబ్‌ ఎప్పుడు కూలుతుందో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు భయాందోళనలో ఉండి ఉపాధ్యాయులు భోదించేవి శ్రద్ధగా వినట్లేదు. అభ్యాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ఐదేళ్ల నుండి శ్లాబు శిథిలావస్థలో ఉండగా నాటి నుంచి ఇప్పటివరకూ అలానే నెట్టుకుంటూ వస్తున్నారు. వర్షాలు సంభవించిన సమయంలో ఎప్పుడు స్లాబ్ కూలుతుందోన‌ని విద్యార్థులు ఆందోళన చెందారు. మరికొన్ని గదులు సైతం చెమ్మగిల్లుతున్నాయి. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలమవుతున్న గదుల వద్ద వెంటనే నూతన తరగతి గదులు నిర్మాణం ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు లేనందున ఇంచార్జిగా మంజులా దేవి విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్తిస్థాయి ప్రధానోపాధ్యాయులను వెంటనే నియమించి పాఠశాలను అభివృద్ధి బాటలో నడిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.
చెట్లే తరగతి గదులాయే…
నూతన విద్యావిధానంలో భాగంగా ఊటుకూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలన్న ఆదేశాల మేరకు 55మంది విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. అయితే తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులకు చెట్ల క్రిందే విద్యాబోధన సాగుతోంది. మధ్యాహ్న భోజన సమయంలో సరైన వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు.వెంటనే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement