Friday, January 21, 2022

కాలు దువ్వుతున్న కో ‘ఢీ’..

ఒంగోలు, ప్రభన్యూస్‌ : సంక్రాంతి వచ్చిందంటే చాలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందెల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు సమాచారం. గత వారం ఒంగోలు రూరల్‌ మండలంలోని గూండాయిపాలెం పాంత్రంలో బకింగ్‌హాంకెనాల్‌కు సముద్ర తీరానికి మధ్య ఉన్న రొయ్యల చెరువుల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కోళ్ల పందేలను పోలీసులు భగ్నం చేశారు. జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పందెంగాళ్లు భారీగా బెట్టింగ్‌లు పెట్టేందుకు సిద్దమై.. పందాలకు సిద్దపడుతున్న విషయం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులను చూసి పందెంగాళ్లు పడవల్లో పారిపోయారు. అక్కడ ఉన్న రెండు కార్లతో పాటు, 24 బైక్‌లు, రూ.10వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రాంతంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో నిర్వాహకులు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకుని కోడి పందేలకు సిద్దపడటం ఆనవాయిగా వస్తోంది. గుండాయిపాలెం, చింతాయిగారిపాలెం, కొత్తపట్నం, మోటుమాల, గుండమాల, పాలక, చీరాల, సంతమాగులూరు, కనిగిరి, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు నగరం, అద్దంకి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, గుంటూరు జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల్లో సంక్రాంతికి ముందే కత్తికట్టి కోడి కాలు దువ్వుతోంది. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో ఉన్న పొలాలు కోడి పందేలకు స్థావరంగా మారుతున్నాయి. గ్రామ గ్రామాన పందెం పుంజులు పౌరుషాన్ని చూపించనున్నాయి. అందుకు అనుగునంగానే పందాల బరిలో సిద్ధమయ్యాయి. జిల్లాలో ఎటువంటి సిఫారుసులు అవసరం లేకుండానే నిర్వాహకులు కోడి పందేల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పందేల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా.. నిర్వాహకులు మాత్రం సీక్రెట్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News