Sunday, May 5, 2024

గృహకార్మిక చట్టాలు అమలులో ఉన్నాయా? పార్లమెంట్లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్) : దేశంలోని మొత్తం గృహ కార్మికుల సంఖ్యపై ఏదైనా డేటా ఉందా? అలా అయితే, ఇప్పటివరకు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న గృహ కార్మికుల సంఖ్య ఎంత? అని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సోమవారం పార్లమెంట్ లో ప్ర‌శ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గృహ కార్మికుల సమస్యలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్దిష్ట పథకం లేదా కార్యక్రమాన్ని ప్రారంభించిందా అని ప్ర‌శ్నించారు. గృహ కార్మికుల కోసం ముసాయిదా జాతీయ విధానం పరిశీలనలో ఉందనేది నిజమేనా? అలా అయితే.. పాలసీ అమలు, ప్రస్తుత స్థితి.. దాని వివరాలు, తెలియ‌జేయాల‌ని గురుమూర్తి అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖామంత్రి భూపేందర్ యాదవ్ బదులిస్తూ.. గృహ కార్మికుల కోసం ఎలాంటి జాతీయ ముసాయిదా విధానం లేద‌న్నారు. ఈ – శ్రమ్ పోర్టల్‌లో 2.76 కోట్ల మంది గృహ కార్మికులు జులై 12, 2022 నాటికి, నమోదు చేసుకున్నారని చెప్పారు. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం ప్ర‌కారం.. గృహ కార్మికులతో సహా అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రతను అందిస్తుంద‌ని చెప్పారు. అసంఘటిత కార్మికులకు పెన్షన్ కోసం ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, వికలాంగుల రక్షణ కోసం.. ప్రధాన మంత్రి శ్రమ యోగి మన్ ధన్ పెన్షన్ యోజన వంటి కేంద్ర రంగ పథకాలను ప్రారంభించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement