Monday, April 29, 2024

గుడ్ల ఉత్పత్తిలో ఏపీకి తొలి స్థానం.. నాబార్డు తాజా అధ్యయన నివేదిక విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ పశు సంవర్ధక రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించిన దేశంలోని అయిదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తాజా అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2020-21 పాల ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ తరువాత ఏపీ అయిదో స్థానంలో నిలిచింది. 3,13,59,000 కోట్ల విలువైన పాల ఉత్పత్తి చేయటం ద్వారా ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానం దక్కించుకోగా 1,47,14,000 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించి ఏపీ అయిదో స్థానం దక్కించుకుంది. పాల ఉత్పత్తిలో అయిదో స్థానంలో నిలిచిన ఏపీ గుడ్ల ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ గా నిలిచింది. కొవిడ్‌ సంక్షోభాన్ని తట్టుకుంటూ 2020-21లో 2496.39 కోట్ల విలువైన గుడ్ల ఉత్పత్తి సాధించినట్టు నాబార్డు తెలిపింది. గుడ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలు ఉత్తమ ఫలితాలు సాధించాయి.

పాలు, గుడ్లు మాత్రమే కాకుండా మాంసం ఉత్పత్తిలోనూ ఏపీ గణనీయమైన ఫలితాలను రాబట్టింది. 9,54,000 కోట్ల విలువైన మాంసం ఉత్పత్తి చేయటం ద్వారా ఆ రంగంలో ఏపీ నాలుగో స్థానం దక్కించుకోగా 11,09,000 కోట్ల విలువైన మాంసం ఉత్పత్తితో మహారాష్ట్ర మొదటి స్థానం దక్కించుకుంది. మాంసం ఉత్పతిలో రెండు, మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ నిలవగా తెలంగాణ రాష్ట్రం అయిదోస్థానం దక్కించుకుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వ్యవసాయరంగం స్థిరత్వం సాధించేందుకు పశు సంవర్ధక రంగం చోదకశక్తిగా తోడ్పాటు-నందిస్తుందని తాజా అధ్యయన నివేదికలో నాబార్డు వెల్లడించింది. దేశ వ్యాపిత పశుసంవర్ధక వృద్ధిలో ఏపీ వాటా 30.31 శాతం ఉందనీ, అధునాతన సాంకేతిక వ్యవస్థను వినియోగించటం ద్వారా ఆ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నట్టు నాబార్డు ప్రశంసించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement