Monday, May 6, 2024

AP – సైకిలెక్కిన ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి…

విజయవాడ: వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నాన్ లోకల్ అయినా నూజివీడులో ప్రజల పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

మరోవైపు.. టీడీపీలో చేరిన తర్వాత పార్థసారథి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీలో బీసీలకు దళితులకు న్యాయం జరగడం లేదని.. పదవులు ఇచ్చినా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీకి భవిష్యత్ ఉండదన్నారు. అందువల్లే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పార్థసారథి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే టిక్కెట్ను కొలుసు పార్థసారథికి టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కాగా.. పార్టీ తనపై ఉంచిన నమ్మకం మేరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్థసారథితోపాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ తదితరులు తెదేపాలో చేరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని), శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెదేపా-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement