Tuesday, May 14, 2024

ప్రధానితో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ భేటీ.. ప్రభుత్వ రుణాలపై కేంద్రానికి నివేదిక!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఆయనతో అనేకాంశాలపై చర్చించారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి నివేదికలివ్వడం చర్చనీయాంశం కాగా, ఇప్పుడు ఏపీ గవర్నర్ ఢిల్లీ పర్యటన వెనుక కూడా ఈ తరహా నివేదికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తున్న నిధులు, రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టించి సంక్షేమ పథకాలకు వినియోగిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర వివరాలు అందజేయాలని, ఆ తర్వాతే కొత్త రుణాలకు అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట ఏకంగా గవర్నర్‌నే హామీగా పెడుతూ రూ. 25 వేల కోట్ల వరకు అప్పు చేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై న్యాయస్థానాలతో పాటు కేంద్రం కూడా ఆరా తీస్తోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అన్ని అంశాలపై కేంద్రానికి ఓ నివేదికను అందజేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కేంద్రమే గవర్నర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు రాజకీయ పరిస్థితులపై కూడా గవర్నర్ నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీతో జట్టుకట్టాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తోంది. రాష్ట్ర గవర్నర్‌తోనూ ఎలాంటి విబేధాలు లేవు. కానీ రుణపరిమితి వంటి అంశాల్లో వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ మధ్యనే రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. గతంలో గవర్నర్లు కేంద్ర హోంమంత్రిని కలిసి నివేదికలు అందజేయడం, రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవడం రివాజుగా మారింది. కానీ గత కొన్నాళ్లుగా ఇందుకు భిన్నంగా ఢిల్లీ పర్యటనలో గవర్నర్లు ప్రధానిని కలిసి చర్చలు జరుపుతున్నారు. ఏపీ గవర్నర్ ఢిల్లీ పర్యటన కూడా ఇందులో భాగమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో ఏపీ రాజకీయాంశాలు, ఆర్థిక పరిస్థితి, రుణాలపై లోతుగా చర్చించినట్టు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement