Monday, May 6, 2024

AP – దోపిడీ, దౌర్జన్యకాండ నుంచి విముక్తి కోసమే పొత్తులు – చంద్రబాబు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) తాము సృష్టించిన సంపదను కొందరు దోచేస్తున్నారని, రాష్ట్రభవిష్యత్తు కోసం తాము జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, దోపిడీలను నివారించాలంటే రాజకీయ పొత్తులు తప్పవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 17 వ తేదీన చిలకూరిపేటలో తమ కూటమి సభకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, ఈ సభతో తమ పోరాటం ప్రారంభం కానుందని చంద్రబాబు నాయుడు వివరించారు.

1990లో దేశంలో సంస్కరణలు పారంభమయ్యాయని, పీవీ నరసింహారావు నాయకత్వంలో ఈ సంస్కరణలు తెరమీదకు రాగా.. దేశంలో సంపద పెరిగిందన్నారు. తాను సీఎంగా ఉన్న తరుణంలో విద్యుత్తు కోతలతో రైతులు ఆందోళన చేశారని, ఆ తరువాత తాను రెగ్యులేటరీ విధానం అమలు చేయటంతో విద్యుత్తు సమస్యలు తీరాయన్నారు. విద్యుదుత్పత్తి, విద్యుత్తు సరఫరా, యాజమాన్యం అంశాలతో విద్యుత్తులో సంస్కరణలను తీసుకు వచ్చామన్నారు.

ఉమ్మడి రాష్ర్టంలో సంపద పెరిగిందని, కానీ ఈ సంపద ప్రజలను చేరలేదన్నారు. ఏపీలో ప్రస్తుతం దోపిడీదారుల రాజ్యం నడుస్తోందన్నారు. కొండల్ని తవ్వేస్తున్నారని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని, కేవలం ఐదేళ్లల్లో ఏపీ ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయేలో చేరటంపైన, జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకోవటంపై నానా విమర్శలు వచ్చాయని, కానీ వాస్తవం రాష్టభవిష్యత్తే మూలం అని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement