Tuesday, May 14, 2024

Andhra Pradesh – విద్యారంగంలో న‌వోద‌యం …..

అమరావతి, ఆంధ్రప్రభ:నేటి పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే పిల్లలను ప్రాధమిక స్థాయి నుండి సన్నద్ధం చేయాల్సిందే. అందుకె పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి తల్లిదండ్రులు పైసా పైసా కూడెబెట్టి లక్షల రూపాయలు దాబోసి చదివిస్తున్నారు. కానీ మీ చిన్నారులలో ప్రతిభ ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా సకల సదుపాయాలతో ఆరు నుండి ఇంటర్మీడి యట్‌ వరకు ఉచిత విద్యను అందిస్తున్నాయి నవోదయ విద్యాలయాలు. ఆహ్లాదకరమైన వాతావరణ సాంకేతితో కూడిన కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రయోగశాలలు, గ్రంథాలయాలతో పాటు మానసికోల్లాసాన్ని అందించేలా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ఒత్తిడి లేని విద్యను ఉచిత అందిస్తున్నాయి. 2024 – 25 విద్యా సంవత్సరాని కి గాను 6వ తరగతి ప్రవేశానికి వచ్చే యేడాది జనవరి 20వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి 3,15,555 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

విద్యార్ధి జీవితంలో పాఠశాల విద్య ఎంతో కీలకమైనది. ్నపాధమిక దశలో నేటి కాలానికి అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో వినూతన్న బోధనా విధాన్ని అమలు చేస్తూ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ప్రతిభగల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనుకబడి చదువుకోలేని విద్యార్ధులకు ఇవి బాసటగా నిలుస్తున్నాయి. వారి ప్రతిభ వృధా కాకూడదనే ఉద్దేశ్యంతో సృజనాత్మక పద్ధతిలో బోధన, ఆహ్లాదకరమైన వాతావరణంలో లెర్నింగ్‌ బై డూయింగ్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. పాఠశాల ప్రాధమిక దశ నుండే విద్యార్ధులలో వాస్తవిక దృక్పధాన్ని పెంపొందించి ఉన్నతంగా రాణించేలా దోహదపడుతున్నాయి.

3.15 లక్షల మంది దరఖాస్తు
దేశంవ్యాప్తంగా 649 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏపీలో 15, తెలంగాణాలో 9 ఉన్నాయి. ఈ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి నుండి ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం ప్రతి యేటా జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ (జెఎన్‌విఎస్‌టి) రాత పరీక్షలను నిర్వహిస్తారు. 2024-25 విద్యా సంవత్సరం నవోదయ విద్యాలయంలో 6వ తరగతి చేరడానికిగాను ప్రవేశాలకు అధికారులు ఈ యేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,15,555 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బాలురు 1,67,584, బాలికలు 1,47,936, ట్రాన్స్‌జెండర్స్‌ 31 మంది. గతేడాది 3,08,621 మంది దరఖాస్తు చేసుకోగా ఇపుడు ఆ సంఖ్య పెరగడం విశేషం. దేశ వ్యాప్తంగా రెండు (సమ్మర్‌ బౌండ్‌, వింటర్‌ బౌండ్‌) కేటగిరీలో పరీక్షలను నిర్వహిస్తారు. వింటర్‌ బౌండ్‌ కేటగిరిలో ఉత్తరాది రాష్ట్రాలలోని (నార్త్‌ ఇండియా) పాఠశాలల్లో నేడు పరీక్షలను నిర్వహించనున్నారు. సమ్మర్‌ బౌండ్‌ విభాగంలో ఉన్న తెలుగు రాష్ట్రాలలో వచ్చే యేడాది జనవరి 20వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో విద్యాలయంలో గరిష్టంగా 80 మంది విద్యార్ధులకు 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.

వీరు అర్హులు…
2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్ధులు వచ్చే యేడాది నిర్వహించె జెఎన్‌విఎస్‌టి కు అర్హులు. విద్యార్ధులు అడ్మిషన్‌ కోరుకునే జిల్లాలోనే 5వ తరగతి చదవాల్సి ఉంది. ఒకసారి మాత్రమె పరీక్ష రాయడానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు 75 శాతం సీట్లను కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదవాల్సి ఉంటుంది. 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి వయస్సు 2012 మే1 – 2014 జులై 31 మధ్యలో జన్మించి ఉండాలి.
ఎంపిక ఇలా…
ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జెఎన్‌విఎస్‌టిలో సాధించిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న జిల్లా, ఆ జిల్లాలో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజరేషన్లు తదితరాల ఆధారంగా జిల్లా స్థాయిలో మెరిట్‌ జాభితా ప్రకటిస్తారు. మొత్తం సీట్లలో 3వ వంతు అంటే 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఒక్క విద్యార్ధి ఒక్కసారి మాత్రమె పరీక్షకు అనుమతిస్తారు.
ఎంపికైన వారికి…
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి రెసిడెన్షియల్‌ తరహాలో వసతి, భోజన సదుపాయం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఇలా అన్ని సదుపాయాలను అందిస్తారు. అయితే విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెల‌కు రూ 600 చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపు నుంచి ఎస్సీ, ఎస్టీ, బిపిఎల్‌ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) వారికి మినహాయింపునిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు నెలకు రూ 1500 చెల్లించాల్సి ఉంది. 6వ తరగతి వరకు మాతృ, ప్రాంతీయ భాషలో చదివే అవకాశం కల్పిస్తారు. 8వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదవాల్సి ఉంది. గణితం, సైన్సు సబ్జెక్టులు ఇంగ్లీషు మీడియం, సోషల్‌ సైన్సు హిందీ మీడియంలో చదవాల్సి ఉంది. 24 గంటల ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్‌ ల్యాబ్‌ 49 కంప్యూటర్‌లు అందుబాటులో ఉంటాయి. 6వ తరగతి నుంచి ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కంప్యూటర్‌ నేరుకోవాల్సి ఉంది.
మానసికోల్లాసం పెంపొందించడానికి….
విద్యార్ధులలో ఒత్తిడిని తొలగించి మానసికోల్లాసాన్ని అందించడానికి పాఠశా లలో విశాలమైన క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. అందులో ఫుట్‌బాల్‌, వాలీబా ల్‌, బాస్కెట్‌ బాల్‌, బాడ్మింటన్‌, ఖో – ఖో, కబడ్డీ, హ్యాండ్‌ బాల్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. వీటితో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పుస్తక పఠనం అలవడేలా చదువుకు సంబంధించిన సుమారు 9 వేలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే 8 వేల పుస్తకా లను అందుబాటులో ఉంచారు. ఎన్‌సీసీ, సౌట్స్‌, గైడ్స్‌లో శిక్షణనుకూడా ఇస్తారు.నవోదయ విద్యాలయాల్లోని విద్యార్ధులకు జెఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలలో కూడా శిక్షణ ఇచ్చి ఉత్తమ ఫలితాలను రాబడుతున్నారు. 2022 జెఈఈ మెయిన్స్‌కి 7585 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 4296 (56.6 శాతం) మంది అర్హత సాధించారు. 2022 జెఈఈ అడ్వాన్స్‌లో 3 వేల మంది పరీక్షలు రాయగా 1010 (33.7 శాతం) మంది అర్హత సాధించారు. 2022లో 24807 మంది నీట్‌ పరీక్షలు రాయగా 19352 (78 శాతం) మంది అర్హత సాధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement