Saturday, April 27, 2024

పోలవరంపై తప్పుడు ప్రచారం ఇంకెన్నాళ్లు : దేవినేని ఉమామహేశ్వరరావు

అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంకెన్నాళ్లు తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరుగులు పెట్టించి 71 శాతం పూర్తిచేశారని తెలిపారు. ఆనాడు కేంద్రమంత్రి గడ్కరీ కూడా ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రశంసించారని దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను దేవినేని ఉమా ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్రమంత్రి ఇటీవల పోలవరంపై రివ్యూ చేశారని ఈ సమావేశం మినిట్స్‌, విజువల్స్‌ను మంత్రి అంబటికి ధైర్యముంటే విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. రివర్స్‌ టెండరింగ్‌తో వెళ్లిన ప్రభుత్వం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని విమర్శించారు. జీవో 67ను తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టును తప్పుడు నిర్ణయాలతో ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. ఏపీజెన్‌కో చేస్తున్న పవర్‌ ప్రాజెక్టు పనులను కొట్టేసేందుకు ఈ విధమైన నిర్ణయాలు చేశారని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్‌ విసిరారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసీఆర్‌ చెప్పారని ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చేందుకు ప్ర భుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. గడిచిన మూడేళ్లలో చేసిన పనులు చెల్లించిన బిల్లుల వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement